ఆదరిద్దాం.. అభయమిద్దాం | - | Sakshi
Sakshi News home page

ఆదరిద్దాం.. అభయమిద్దాం

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

ఆదరిద్దాం.. అభయమిద్దాం

బుట్టాయగూడెం: వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం, వైల్డ్‌లైఫ్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఎక్కడో ఒకచోట వేటగాళ్ల స్వార్థానికి మూగజీవాలు ఆవాసాన్నే కాదు, ప్రాణాలనూ కోల్పోతున్నాయి. ఏటా ప్రపంచ జనాభా పెరుగుతుండగా, వన్యప్రాణుల సంఖ్య మాత్రం క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని జాతులు పూర్తిగా కనుమరుగవగా, మరికొన్ని అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతిఏటా అక్టోబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. జంతువులను ప్రతిఒక్కరూ ఆదరించాలని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వైల్డ్‌లైఫ్‌ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంతో పాటు పాపికొండల అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణకు పక్కా చర్యలు తీసుకుంటున్నారు.

1.12 లక్షల హెక్టార్లలో అభయారణ్యం

1,12,500 హెక్టార్లలో పాపికొండల అభయారణ్యం విస్తరించి ఉంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని పాపికొండల అభయారణ్యం పరిధిలోకి వచ్చే బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. వైల్డ్‌లైఫ్‌ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జంతువుల సంచారాన్ని గుర్తిస్తున్నారు. అలాగే, జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పాపికొండల అభయారణ్యంలో ఎలుగుబంట్లు, కొండగొర్రెలు, జింకలు, కొండచిలువలు, అడవి పందులు, అడవి దున్నలు, అడవి కుక్కలు, గెద్దలు, నెమళ్లు, చిరుతలు, చుక్కల దుప్పులు, సాంబార్లు, ముళ్లపందులు, ముంగీసలు తదితర వన్యప్రాణులు సంచరిస్తున్నాయి.

ఈ ఏడాది జంతు గణన

2018లో పాపికొండల అభయారణ్యంలో వైల్డ్‌లైఫ్‌ అధికారులు జంతు గణన నిర్వహించి జంతువుల కదలికలను గుర్తించారు. ఆ తర్వాత 2022 జనవరిలోనూ మరోసారి జంతు గణన కార్యక్రమాన్ని చేపట్టారు. అభయారణ్యంలోని సుమారు 116 ప్రాంతాల్లో 232 ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేసి సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేల్లో ఏనుగులు, సింహాలు మినహా మిగిలిన అన్ని రకాల జంతువులు, పక్షులు, ఉభయచర జీవులను గుర్తించారు. అలాగే, జంతువుల సంరక్షణపై బేస్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేసి వైల్డ్‌లైఫ్‌ అధికారులు ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారని, కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ట్రాప్‌ కెమెరాకు చిక్కిన చిరుత పులులు కొండగొర్రెలు

వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

జంతుజాతులకు ఆవాసంగా పాపికొండల అభయారణ్యం

రేపటి నుంచి వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement