రైతుల కళ్లు చె‘మిర్చి’ | - | Sakshi
Sakshi News home page

రైతుల కళ్లు చె‘మిర్చి’

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

కుకునూరు: గోదావరి వరదలతో విలీన మండలాల్లోని మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉధృతి పెరిగి పొలాలు మునిగిపోవడంతో, నాటిన తొలి దశలోనే మిర్చి మొక్కలు కుళ్లిపోయాయి. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు ప్రారంభించిన కొద్దిరోజులకే పంట నీటమునగడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిహారం ఉన్నా లభించని వైనం

పోలవరం ప్రాజెక్టు ముంపు భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించినప్పటికీ, ఆ గ్రామాలు 45 కాంటూర్‌ పరిధిలో ఉన్నాయనే కారణంతో పునరావాస (ఆర్‌అండ్‌ఆర్‌) పరిహారాన్ని నిలిపివేసింది. దీంతో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందక, వేరే ప్రాంతాలకు తరలివెళ్లే మార్గం లేక రైతులు అదే భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే భూములకు పూర్వమే పరిహారం ఇచ్చామనే కారణంతో ప్రభుత్వం ఇప్పుడు పంట నష్టపరిహారాన్ని అందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు భూపరిహారం అందినా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందకపోవడం, మరోవైపు ప్రతి ఏటా వరదలతో పంటలు నష్టపోతున్నా కనీస పంట పరిహారం కూడా లభించకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు.

ఆర్‌అండ్‌ఆర్‌ అమలుపై అనిశ్చితి

45 కాంటూర్‌ పరిధిలోని రైతులకు పునరావాస ప్యాకేజీ ఎప్పుడు అమలు చేస్తారు? పరిహారం ఎప్పుడు అందుతుంది? ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు సాగు చేసే పంటలకు వరద నష్టం వాటిల్లితే పరిహారం ఇస్తారా? లేదా? అనే ప్రశ్నలకు అధికారుల నుంచి స్పష్టత కరువైంది. భూమికి గతంలో పరిహారం ఇచ్చారనే నెపంతో ఇప్పుడు పంట నష్టాన్ని విస్మరించడం సరికాదని, తమ జీవనాధారమైన వ్యవసాయానికి రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం 45 కాంటూర్‌ పరిధిలోని ముంపు రైతుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, దెబ్బతిన్న మిర్చి పంట నష్టాన్ని నమోదు చేసి తక్షణ సహాయం అందించాలని, అలాగే ఆర్‌అండ్‌ఆర్‌ ప్రక్రియ పూర్తి చేయడంపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మిరపను ముంచేసి‘నది’

మొక్క దశలోనే ముంపు

గోదావరి వరదతో నష్టం

రైతుల పరిస్థితి దయనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement