15 మందికి గాయాలు
ఆగిరిపల్లి: ఆగిరిపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త మాదల సునీత అస్వస్థతకు గురై విజయవాడలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మంత్రి కొలుసు పార్థసారథి, ఆయన అనుచరులపై పలు సంచలన ఆరోపణలు చేశారు. తన స్థలాన్ని వారు అక్రమంగా లాక్కోవాలని చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, బుధవారం ఉదయం సబ్ కలెక్టర్ బి. వినూత్న, తహసీల్దార్ ప్రసాద్ వివాదాస్పద స్థలం వద్దకు చేరుకుని, మాదల సునీత దగ్గరున్న పత్రాలతో పాటు ప్రభుత్వ రికార్డులను పరిశీలించారు. అయితే, ఈ పరిణామాల కారణంగా ఆమె తీవ్ర ఒత్తిడికి గురై అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు.
పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలో ఓ కుక్క స్వైరవిహారం చేయడంతో 15 మంది గాయపడినట్లు స్థానికులు తెలిపారు. స్థానిక జెట్టిట్యాంకు ప్రాంతంలో ఓ పిచ్చికుక్క మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు సుమారు 15 మందిని కరవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 9 మంది పురుషులు, నలుగురు మహిళలు మొత్తం 13 మంది చికిత్స చేయించుకోగా, మిగిలిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందినట్లు తెలిసింది. వీధుల్లో కుక్కలను అదుపు చేయాలని బాధితులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రుల్లో మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్‌గా పనిచేస్తున్న ఒకరిని ఆ కుక్క వెనుక నుంచి వచ్చి కాలు పట్టుకుని కరిచింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ కుక్కను పట్టుకున్నట్లు సమాచారం.


