పాలకొల్లు సెంట్రల్: భార్య, ఇద్దరు కుమార్తెలు... ఆ ఆడపిల్లల పెళ్లిళ్లు ఘనంగా జరిపించి, కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే కలలతో బ్రతుకు బండిని లాగుతున్న ఆ తండ్రి ఆశలు గల్ఫ్ గడ్డపైనే ఆవిరైపోయాయి. కుటుంబం కోసం విదేశాలకు వెళ్లిన నూకపెయ్యి సోమశేఖర్ (48) గుండెపోటుతో మృతి చెందడం ఆ గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... పోడూరు మండలం వద్దిపర్రు గ్రామానికి చెందిన నూకపెయ్యి సోమశేఖర్ కుటుంబ పోషణ, పిల్లల భవిష్యత్తు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీసా, ఫ్లైట్ టికెట్ కోసం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఎన్నో ఆశలతో ఈ నెల 14న అబుదాబికి బయలుదేరి వెళ్లారు. అబుదాబి చేరుకున్న వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ‘ఇక మన కష్టాలు తీరిపోతాయి, మన ఇంట వెలుగులు వస్తాయి’ అనుకున్న ఆ కుటుంబం ఆనందం పది రోజులు కూడా నిలవలేదు. సెప్టెంబర్ 23న ఆయన తాను వెళ్లిన పనిలో చేరారు. అయితే, విధి ఆ కుటుంబంపై పగబట్టిందో ఏమో గానీ... చేరిన తొలిరోజే ఆయనకు గుండెపోటు రావడంతో సోమశేఖర్ మృత్యువాత పడ్డారు. భర్తపై ఎన్నో ఆశలు పెట్టుకున్న భార్య, తండ్రి రాక కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలు ఆయన మరణవార్త విని గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆక్రందనలు చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టారు. విదేశాల్లో బతుకుదెరువు వెతుక్కుంటూ వెళ్లి విగతజీవిగా మారిన సోమశేఖర్ భౌతికకాయం నేడు అబుదాబి నుంచి స్వగ్రామానికి చేరుకోనుంది.
బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి..
ఉద్యోగంలో చేరిన తొలిరోజే గుండెపోటుతో మృతి
గుండెలు పగిలేలా రోదిస్తున్న కుటుంబ సభ్యులు


