పుట్టినరోజే కన్నీటి సంద్రం | - | Sakshi
Sakshi News home page

పుట్టినరోజే కన్నీటి సంద్రం

Oct 1 2026 4:34 AM | Updated on Oct 1 2026 4:34 AM

పుట్టినరోజే కన్నీటి సంద్రం

● రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు మృతి

● ముగ్గురికి తీవ్ర గాయాలు

● కుటుంబ సభ్యులకు తీరని విషాదం

నరసాపురం రూరల్‌ : కళ్ల ముందే అల్లారుముద్దుగా పెరిగిన కొడుకు ఐదో పుట్టినరోజు వేడుకలను ఆనందంగా జరుపుకోవాలనుకున్న ఆ తల్లిదండ్రుల కల క్షణాల్లో కన్నీటి సంద్రమైంది. జన్మదిన వేడుకల సంతోషం విషాదంగా మారిన ఈ హృదయ విదారక ఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మోళ్లపర్రు బీచ్‌ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మొగల్తూరు మండలం కొత్తోట గ్రామానికి చెందిన బర్రె త్రిమూర్తులు దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు నిషాంతవర్మకు ఐదేళ్లు వయసు కాగా, చిన్న కుమారుడికి మూడేళ్లు. నిషాంతవర్మ ఐదో జన్మదినాన్ని ఆనందంగా జరుపుకోవడానికి కుటుంబ సభ్యులంతా మోళ్లపర్రు బీచ్‌కి వెళ్లారు. తమ చిన్నారి కేకు కోసి, నవ్వులు చిందించిన ఆ మధుర క్షణాలను వారు జీవితంలో ఎప్పటికీ మరువలేరని భావించారు. అయితే, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. బీచ్‌ సందర్శన ముగించుకుని కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి బయలుదేరుతున్న తరుణంలో కాలాన్ని ముందే నిర్ణయించినట్లుగా పెను ప్రమాదం ముంచుకొచ్చింది. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక వ్యాన్‌, వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో పుట్టినరోజు జరుపుకున్న చిన్నారి నిషాంతవర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందే తమ బిడ్డ విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడివారందరినీ కంటతడి పెట్టించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు కుటుంబ సభ్యులను మెరుగైన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement