● ప్రియుడితో కలిసి పథకం ప్రకారం భర్త హత్య
● ముగ్గురు నిందితుల అరెస్ట్
కొయ్యలగూడెం : ఇటీవల సంచలనం సృష్టించిన పల్లికొండ మునీంద్రబాబు హత్య ఉదంతాన్ని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే మునీంద్రబాబు హత్యకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త మునీంద్రబాబును భార్య తులసితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు హత్య చేసినట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ వెల్లడించారు. బుధవారం పోలీస్ స్టేషన్‌లో నిందితులను అరెస్టు చేసి, హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కన్నాపురం గ్రామానికి చెందిన పల్లికొండ మునీంద్రబాబు భార్య తులసికి, వారి వద్ద కార్పెంటర్‌గా పనిచేస్తున్న గెల్లా చందుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భర్తను అడ్డుతొలగించుకోవడానికి తులసి కుట్ర పన్నింది. సెప్టెంబర్ 25న చందు, అతని స్నేహితుడు అయినపర్తి సంజయ్‌లతో కలిసి పథకం ప్రకారం మునీంద్రబాబును హత్య చేయించింది. చందు, సంజయ్‌లు మునీంద్రబాబును గవరవరం తీసుకువెళ్లి, సమీపంలోని పొలాల్లో మద్యం తాగించి ఇనుప సుత్తితో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం రేగులగుంట సమీపంలోని పోలవరం కుడి కాలువలో పడవేశారు. తాము చేపట్టిన విచారణలో ఈ విషయాలన్నీ వెల్లడైనట్లు ఎస్సై తెలిపారు. నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం కోర్టుకు హాజరుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.


