దర్భగూడెంలో వ్యక్తి హత్య | - | Sakshi
Sakshi News home page

దర్భగూడెంలో వ్యక్తి హత్య

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

దర్భగూడెంలో వ్యక్తి హత్య దస్తావేజు లేఖరి అనుమానాస్పద మృతి అనారోగ్య కారణాలతో విద్యార్థిని ఆత్మహత్య

బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం బాపూజీ కాలనీలో పి.వెంకయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గ్రామ సమీపంలోని గుడి వద్ద నిద్రిస్తున్న ఆయనపై దుండగులు దాడి చేసి హతమార్చినట్లు సమాచారం. తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్న వెంకయ్యను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలవరం డీఎస్పీ జయకృష్ణ, సీఐ యాదగిరి, ఎస్సై క్రాంతికుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. అలాగే డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి క్లూస్‌ సేకరిస్తూ, హత్యకుగల అసలు కారణాలను వెలికితీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు వారు తెలిపారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు నగర శివారు శనివారపుపేట ప్రాంతంలో దస్తావేజు లేఖరి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. శనివారపుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంతానికి చెందిన వల్లి శివరామకృష్ణ (44)కు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన ఏలూరు రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. శివరామకృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున గ్యాస్‌ నొప్పి అధికం కావడంతో, దానిని తగ్గించే మందును ఆయన అధిక మోతాదులో తాగారని, ఆ తర్వాత నిద్రలోకి జారుకుని మంచంపై నుంచి కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయమైందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి (జీజీహెచ్‌) తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆయన మృతిచెందారు. ఈ సంఘటనపై మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు.

ఏలూరు టౌన్‌: అనారోగ్య కారణాలతో ఇంటర్మీడియెట్‌ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏలూరు నగర శివారు శనివారపుపేటలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెదపాడు మండలం తాళ్ళగూడెం గ్రామానికి చెందిన రాజేష్‌ గతంలో ఆటో డ్రైవర్‌గా పనిచేయగా ప్రస్తుతం సినిమా రంగంలో పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబం గత కొన్నేళ్లుగా ఏలూరు శనివారపుపేట పోస్టాఫీస్‌ వీధిలో నివాసం ఉంటోంది. రాజేష్‌ కుమార్తె జల్లా నీరజ (16) ఏలూరులోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కళాశాలకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమె చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి (జీజీహెచ్‌) తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న ఏలూరు త్రీటౌన్‌ సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement