పోలవరం రూరల్: జిళ్ళేళ్ళగూడెం పంచాయతీ పరిధిలో దశాబ్దాలుగా గిరిజనుల సాగులో ఉన్న భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఏజెన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మనుగోపుల గ్రామంలోని రామాలయం వద్ద ధర్నా శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సవలం రాంబాబు, జిల్లా అధ్యక్షుడు కుంజం రామారావు మాట్లాడుతూ.. జిళ్ళేళ్ళగూడెం పరిధిలో గత 40 ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కులు కల్పించకుండా, అధికారుల నుంచి నోటీసులు జారీ చేయించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ సంక్షేమ చట్టాలను పక్కాగా అమలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని, ఐటీడీఏ అధికారులు గిరిజనుల పక్షాన నిలబడాలని డిమాండ్ చేశారు. తమ భూములను ఖాళీ చేయించే ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. అనంతరం మనుగోపుల నుంచి రెడ్డినాగంపాలెం వరకు నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కలుం సూర్యకాంతం, కలుం శ్రీను, దాడి రాముడు, పట్టేం పరమేశ్వరరావు, మిడియం రవి దొర, సోదెం కనకలక్ష్మి, కారం దుర్గ తదితరులు పాల్గొన్నారు.


