పశ్చిమ పర్యాటకం.. అందాల ఆతిథ్యం | - | Sakshi
Sakshi News home page

పశ్చిమ పర్యాటకం.. అందాల ఆతిథ్యం

Sep 27 2026 1:16 AM | Updated on Sep 27 2026 1:16 AM

ద్వారకాతిరుమల: పర్యాటకంగా చూస్తే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, నదీ తీరాలు, సముద్రతీరాలు.. ఇలా భిన్నమైన పర్యాటక అనుభూతులను ఒకే ప్రాంతంలో ఆస్వాదించే అవకాశం ఉంది. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ ప్రాంతంలోని పర్యాటక వైభవం మరోసారి చర్చకు వస్తోంది.

కొల్లేరు.. పక్షుల కిలకిల

ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సు ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణ. కొల్లేరు పక్షుల అభయారణ్యం వలస పక్షులకు ఆవాసంగా నిలుస్తోంది. ముఖ్యంగా అక్టోబర్‌ నుంచి మార్చి వరకు వివిధ ప్రాంతాల నుంచి వలస పక్షులు ఇక్కడకు వస్తాయి. సరస్సు పరిసర ప్రాంతాలు పక్షి వీక్షణకు అనువైన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి.

పాపికొండలు.. గోదావరి అందాలు

గోదావరి నదిని ఆనుకుని విస్తరించిన పాపికొండలు ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. కొరుటూరు వైపు నుంచి పాపికొండల ప్రవేశ ప్రాంతాన్ని చూడొచ్చు. గోదావరి నదిలో బోటు ప్రయాణం, కొండల మధ్య సాగే ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. మార్గమధ్యంలో పట్టిసీమ, పేరంటాలపల్లి వంటి ప్రాంతాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనం

ఆధ్యాత్మిక పర్యాటకంలో ద్వారకాతిరుమలకు ప్రత్యేక స్థానం ఉంది. చిన్నతిరుపతిగా పేరొందిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. దర్శనంతోపాటు ఆలయ పరిసరాల్లోని ఆధ్యాత్మిక వాతావరణం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ద్వారకాతిరుమల నుంచి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుర్వాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయం కూడా సందర్శించదగిన క్షేత్రం.

పంచారామాల వైభవం

పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు క్షీరారామం, భీమవరం సోమారామం ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రధాన కేంద్రాలు. పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. భీమవరంలోని సోమేశ్వర జనార్దనస్వామి ఆలయం కూడా పంచారామాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

అమ్మవారి ఆలయాలు.. ఆధ్యాత్మిక సందడి

భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయం కూడా ప్రముఖ దర్శనీయ స్థలంగా ఉంది. స్థానిక సంప్రదాయాలు, వార్షిక ఉత్సవాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును తెస్తున్నాయి.

పేరుపాలెం.. సముద్ర కెరటాల సందడి

నరసాపురం పరిసర ప్రాంతాల్లోని పేరుపాలెం, మొల్లపర్రు సముద్రతీరాలు పర్యాటకులకు మరో ఆకర్షణ. పచ్చని పొలాలు, కొబ్బరి తోటల మధ్యగా సాగి సముద్రతీరానికి చేరుకోవడం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. పేరుపాలెం బీచ్‌ నరసాపురం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గుంటుపల్లి.. చరిత్రకు సాక్ష్యం

కామవరపుకోట మండలం గుంటుపల్లి బౌద్ధ గుహలు చారిత్రక, పురావస్తు ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. కొండను తొలిచి నిర్మించిన గుహలు ప్రాచీన బౌద్ధ సంప్రదాయానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. ఇవి జిల్లా కేంద్రం నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

ప్రకృతి.. ఆధ్యాత్మికం.. చరిత్ర.. సాగరం.. అన్నీ ఉమ్మడి జిల్లాలోనే

ద్వారకాతిరుమల, పాలకొల్లు, భీమవరంలో ఆధ్యాత్మిక వైభవం

పేరుపాలెం తీరంలో సందడి.. గుంటుపల్లి గుహల్లో చారిత్రక ఆనవాళ్లు

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement