ముసునూరు: పెద్దలు ఇచ్చిన ఓ తీర్పు కుల వెలివేతకు దారి తీసిందనే ఆరోపణలు మండల వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే... మండలంలోని కొర్లగుంట గ్రామంలో ఇటీవల జరిగిన వినాయకుడి ఊరేగింపులో టపాసులు కాల్చే విషయంలో ఘర్షణ చెలరేగింది. మాగంటి రాజేష్‌పై గ్రామానికి చెందిన మాగంటి పండు మరికొందరు వ్యక్తులు దాడి చేశారు. ఇది గమనించిన రాజేష్ మేనత్త ఆయనను రక్షించే ప్రయత్నం చేయగా, ఆమైపె మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె వస్త్రాలు కూడా పీకేశారు. దీనిపై గ్రామంలో పిన్నిబోయిన రంగారావు, మాగంటి రంగారావు, గరికపూడి శ్రీను, శివనారాయణ తదితర కుల పెద్దలంతా కలిసి శుక్రవారం అర్ధరాత్రి దాటే వరకు కుల పంచాయతీ నిర్వహించి, బాధితులకు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అయితే బాధితులు ఆ తీర్పును నిరాకరించడంతో, వేరే విధమైన శిక్ష ఉంటుందని పెద్దలు బెదిరించారు. దీంతో బాధితులు ముసునూరు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై ఎస్సై ఎం.చిరంజీవి మాట్లాడుతూ... కుల బహిష్కరణ వంటి శిక్ష ఏదీ విధించలేదని, పెద్దల తీర్పు బాధితులకు నచ్చకపోవడంతోనే వారు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదుపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.
నూజివీడు: పట్టణంలోని కుమార్ హైస్కూల్‌కు చెందిన ఎన్‌సీసీ జూనియర్ వింగ్ క్యాడెట్లు సీహెచ్ పోషక సాయి, ఆర్ అనూష ఆల్ ఇండియా స్థాయి క్యాంపునకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ పిన్నమనేని వెంకట కుమార్ శనివారం తెలిపారు. వీరు మధ్యప్రదేశ్‌లోని గ్వాలీయర్‌లో నిర్వహించే రాక్ క్‌లైంబింగ్ ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొంటారన్నారు. శిక్షణా శిబిరం ఈనెల 28 నుంచి అక్టోబర్ 10 వరకు జరుగనుందన్నారు.


