ప్రయాణం గోవిందా! | - | Sakshi
Sakshi News home page

ప్రయాణం గోవిందా!

Sep 26 2026 12:32 AM | Updated on Sep 26 2026 12:32 AM

చినవెంకన్న క్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారికి తూట్లు పడ్డాయి. భీమడోలు నుంచి ద్వారకాతిరుమల వరకు ఉన్న రహదారిపై అడుగడుగునా భారీ గోతులు ఏర్పడటంతో భక్తులు, ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గోతులు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రహదారిపై ఏర్పడిన గోతుల వద్ద స్థానికులే ఇసుక మూటలు, డ్రమ్ములను సూచికలుగా ఏర్పాటు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలోని టీటీడీ సదనం వద్ద, కుంకుళ్లమ్మ ఆలయం సమీపంలోని మలుపులో, నిమ్మకాయల మార్కెట్‌ యార్డు, లక్ష్మీపురంలోని జగన్నాథుని ఆలయం ఆర్చిగేటు వద్ద, గొల్లగూడెం చెరువు, సూర్యచంద్రరావుపేట శివారు, పంగిడిగూడెంలో, భీమడోలు మండలం పొలసానిపల్లి గురుకుల పాఠశాల సమీపంలో రహదారి దెబ్బతింది. విర్డ్‌ ఆస్పత్రి వద్ద స్థానికులు రోడ్డు మధ్యలో ఇసుక మూటను పెట్టగా.. ద్వారకాతిరుమల టీటీడీ సత్రం వద్ద గుంతకు డ్రమ్మును అడ్డుగా ఏర్పాటు చేశారు. వాహనదారులు వాటిని తప్పించుకుని వెళ్లాల్సి వస్తోంది.

కొట్టుకుపోయిన ‘మేకప్‌’

గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈనెల 5న ‘గ్రామ స్వరాజ్యం సంకల్ప పాదయాత్ర’ పేరుతో నల్లజర్ల నుంచి ద్వారకాతిరుమల వరకు పాదయాత్రగా వచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈనెల 4న గొల్లగూడెం నుంచి ద్వారకాతిరుమల వరకు రోడ్డుపై ఉన్న గోతుల్లో కంకర డస్ట్‌ పోసి హడావుడిగా పూడ్చి, మేకప్‌ చేశారు. అయితే మూడు రోజులుగా కురిసిన ఎడతెగని వానలకు ఆ మేకప్‌ మొత్తం కొట్టుకుపోయింది. గోతులన్నీ మళ్లీ బయటపడటంతో రహదారి దుస్థితి యథాస్థితికి చేరింది.

ప్రమాదాలకు అడ్డుకట్టేది?

ఈ రహదారి నిర్మించినప్పటి నుంచి తరచూ దెబ్బతింటూనే ఉంది. గతేడాది జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో క్షతగాత్రులైన వారిలో ఎక్కువ మంది బైక్‌లపై చినవెంకన్న దర్శనానికి వచ్చేవారే ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఒక్క సూర్యచంద్రరావుపేట చెరువు సమీపంలో జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలకు లెక్కేలేదు. ఈ పరిస్థితిపై అప్పట్లో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో గతేడాది డిసెంబర్‌లో రహదారికి మరమ్మతులు చేపట్టారు. దీంతో కొంతకాలం ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెండు నెలలుగా మళ్లీ గోతులు ఏర్పడటంతో పాత పరిస్థితి పునరావృతమైంది.

రోడ్డు నిర్మించి పుష్కరం

భీమడోలు–ద్వారకాతిరుమల మధ్య సుమారు 17 కిలోమీటర్ల రహదారిని గత గోదావరి పుష్కరాల సమయంలో రూ.50 కోట్లతో నాలుగు లైన్లుగా విస్తరించారు. రోడ్డు నిర్మించి పుష్కరం కావొస్తున్నా.. సమస్యలకు మాత్రం శాశ్వత పరిష్కారం లభించలేదు. ద్వారకాతిరుమల గుడి సెంటర్‌తో కలిపి సుమారు కిలోమీటరు మేర ఇంకా విస్తరణ పనులు పూర్తికాలేదు. కొంతమంది వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించి స్టేలు తీసుకురావడంతో పనులు నిలిచిపోయాయి. అయితే కొన్ని స్టేలు ఇప్పటికే వెకేట్‌ కాగా.. ఒకటి రెండు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుడిసెంటర్‌ విస్తరణ ఎప్పుడు పూర్తవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

విస్తరణ ఇక కలేనా?

కొద్దినెలల క్రితం గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు గుడి సెంటర్‌ను పరిశీలించి రహదారి విస్తరణ పూర్తి చేస్తామని ప్రకటించారు. అనంతరం పంచాయతీ అధికారులు అక్కడి నివాసితులు, వ్యాపారులకు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత వ్యవహారం మళ్లీ అటకెక్కింది. దీంతో విస్తరణ ఇక కలేనా? అంటూ స్థానికులు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తుండటం వల్లే విస్తరణ పనులు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్‌ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అప్పటికై నా ఈ ప్రధాన రహదారికి శాశ్వత పరిష్కారం చూపుతారా? లేక తాత్కాలిక ‘మేకప్‌’లతోనే సరిపెడతారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

పంగిడిగూడెం శివారు కుమారి దాబా సమీపంలో..

ద్వారకాతిరుమలలోని టీటీడీ సత్రం వద్ద..

గొల్లగూడెం చెరువు వద్ద.

రహదారిద్య్రం

చినవెంకన్న క్షేత్రానికి వెళ్లే రహదారి అధ్వానం

భీమడోలు–ద్వారకాతిరుమల మార్గంలో అడుగడుగునా గోతులు

వర్షాలకు కొట్టుకుపోయిన ‘మేకప్‌’

మళ్లీ భక్తులకు ప్రమాదాల భయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement