బుట్టాయగూడెం: మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలోని కొండవాగులు పొంగుతూనే ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం వరకూ చింతకొండ, కన్నారప్పాడు, కొవ్వాడ, కేఆర్‌పురం తదితర వాగులు ఉధృతంగానే ప్రవహించాయి. అలాగే జల్లేరు జలాశయం, పోగొండ రిజర్వాయర్‌తోపాటు చెరువుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. భారీ వర్షాలకు దొరమామిడి ఎస్సీకాలనీకి చెందిన పూసంపూడి దుర్గమ్మకు చెందిన ఇల్లు కూలిపోయింది. అధికారులు ఆదుకోవాలని ఆమె కోరుతోంది.
గిరిజనుడి మృతదేహం లభ్యం
కేఆర్‌పురం సమీపంలోని తూర్పు కాల్వ వాగులో గురువారం రాత్రి గల్లంతైన గిరిజనుడు పూనెం భాస్కరరావు (60) మృతి చెందాడు. గాలింపు చర్యలు ముమ్మరంగా జరిగాయి. యర్రాయిగూడెం గ్రామశివారు గుడి సమీపంలోని తుప్పల్లో భాస్కరరావు మృతదేహాన్ని గుర్తించారు. గ్రామస్తులు మృతదేహాన్ని బయటకు తీసి జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
శాంతించిన వరుణుడు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాపై మూడు రోజులుగా ప్రతాపం చూపిన వరుణుడు శుక్రవారం ఉదయం నుంచి శాంతించాడు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకూ చెదురుమదురు వర్షాలు కురిశాయి. ఉదయం 7 గంటల తర్వాత జిల్లాలో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు. కాగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం జిల్లాలో సగటున 77.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా 2,175.8 మి.మీ. వర్షం కురిసింది. అత్యధిక వర్షపాతం చింతలపూడిలో 162.4 మి.మీ నమోదు కాగా.. జంగారెడ్డిగూడెంలో 43.2 మి.మీ. అత్యల్ప వర్షం కురిసింది. మండలాల వారీగా పోలవరంలో 136.2, ద్వారకాతిరుమలలో 103, ముసునూరులో 102, కామవరపుకోటలో 101.6, నూజివీడులో 92.4, ముదినేపల్లిలో 83.6, బుట్టాయగూడెంలో 82.2, కొయ్యలగూడెంలో 81.2, వేలేరుపాడులో 81.2, దెందులూరులో 78.6, కుక్కునూరులో 77.4, పెదపాడులో 73.8, లింగపాలెంలో 72.8, చాట్రాయిలో 72.6, ఏలూరు రూరల్ పరిధిలో 71.6 వర్షం కురిసింది.
బుట్టాయగూడెం మండలంలో చింతకొండవాగు ఉధృతి
భాస్కరరావు మృతదేహాన్ని బయటకు తీస్తున్న దృశ్యం


