ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా పరిషత్‌ల పదవీ కాలం ఇటీవల ము గిసిన నేపథ్యంలో ఏలూ రు జిల్లా ప్రజాపరిషత్ ప్రత్యేకాధికారిగా కె.వెట్రిసెల్వి శుక్రవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఇన్‌చార్జి సీఈఓ, డీపీఓ మల్లికార్జునరావు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు.
పోలవరం రూరల్: గోదావరి వరద ఉధృతంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 30 మీటర్ల నీటిమట్టం దాటింది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 4.90 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. దిగువన ఉభయగోదావరి జిల్లాల లంక ఒడ్డులను తాకుతూ ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉపనదుల నీటితో పాటు శబరి నీరు కూడా నదిలోకి చేరడంతో వరద ఉధృతి పెరుగుతోంది. మరో రెండు రోజుల పాటు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
చాట్రాయి: భారీ వర్షాలతో మండలంలోని తమ్మిలేరు ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది. ఎగువన సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు నుంచి వచ్చే వరద జలాశయానికి చేరుతుందని, సుమారు 1500 క్యూసెక్కుల నీరు వస్తున్నట్టు టీఆర్‌పీ అధికారులు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు ఈనెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఈనెల 27న ఆదివారం జిల్లాలోని ప్రభుత్వ రంగ, గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నాలుగో శనివారం, ఆదివారం, మూడు రోజుల సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలకు ప్రజలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, దీంతో ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయన్నారు. ఏటీఎంలు, యూ పీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో హెచ్‌ఐవీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ రాకేష్ గుప్తాకు తెలిపారు. హెచ్‌ఐవీ వ్యాధి నియంత్రణ, నివారణ, చికిత్సలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, హర్యానాకు చెందిన కలెక్టర్లతో ఢిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ వ్యాధి నియంత్రణ, నివారణ, చికిత్సలకు నిర్దేశించిన 3 కీలక లక్ష్యాలను డిసెంబర్ నాటికి సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. డీఎంహెచ్‌ఓ యు.శోభ పాల్గొన్నారు.


