ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో 5,380 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైందని ప్రాథమికంగా గుర్తించినట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌తో శుక్రవారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ ఎంజే అభిషేక్‌గౌడతో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంట పొలాల్లో వరద నీరు తగ్గిన తర్వాత పంట నష్టం లెక్కిస్తామన్నారు. జిల్లాలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని, విద్యుత్ స్తంభం కూలడంతో ఒక పాడి గేదె మరణించిందన్నా రు. ఎనిమిది ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. శనివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరికి మొ దటి ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉందన్నా రు. జలధార–జలహారతి ద్వారా చేపట్టిన 1,943 పనులతో ఇరిగేషన్ చెరువులు, కాలువలు, ఫీడర్ చానెల్స్ వర్షం నీటితో నిండాయన్నారు. ప్రస్తుత వర్షాలతో సూపర్ ఎల్‌నినో ప్రభావం జిల్లాపై లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎటువంటి నష్టం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చే శామన్నారు. ఇన్‌చార్జి డీఆర్వో ఎం.ముక్కంటి, డ్వామా పీడీ కేవీ సుబ్బారావు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


