ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా ఏపీపీటీడీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని, ఎలక్ట్రికల్ బస్సులను పూర్తిగా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని 1,000 ఉద్యోగులు, ప్రజల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని జేసీ అభిషేక్ గౌడకి సమర్పించారు. జిల్లా జేఏసీ చైర్మన్లు కె.రమేష్‌కుమార్, రాంబాబు, కో–కన్వీనర్ ఎన్.సురేష్, ఏపీ జేఏసీ చైర్మన్ కె.రమేష్‌కుమార్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ప్రజారవాణా వ్యవస్థతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.


