త్వరలో జీతాలు చెల్లిస్తాం
భీమవరం: ఎన్నికల సమయంలో రూ. 15 వేలు ఇస్తామంటూ గొప్పగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, నైట్ వాచ్‌మెన్లకు జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత నాలుగు నెలలుగా జీతాలు అందక వారు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ’మనబడి నాడు–నేడు’ పథకంలో భాగంగా పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా తీర్చిదిద్దడమే గాక, పేద విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పకుండా ఉండేందుకు అమ్మ ఒడి పథకం పేరుతో ఏటా రూ.15 వేలు చెల్లించారు. అదే సమయంలో పాఠశాలల్లోని మరుగుదొడ్లు, విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన పరిసరాలను శుభ్రం చేయడానికి అన్ని పాఠశాలల్లో ఆయాలను నియమించారు. పాఠశాలలకు రక్షణగా ఉండేందుకు నైట్‌వాచ్‌మెన్లను నియమించి వారికి నెలకు రూ.6 వేలు చొప్పున వేతనాలు చెల్లించారు. ఆయాలు పాఠశాలలను, మరుగుదొడ్లను శుభ్రం చేసి, మధ్యాహ్న భోజనం అనంతరం వ్యర్థాలను తొలగిస్తుంటారు. మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి అవసరమైన మెటీరియల్‌ను కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో సరఫరా చేసింది.
జిల్లాలో పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి 300 మంది విద్యార్థులకు ఒక ఆయా, 600 మంది విద్యార్థులకు ఇద్దరు, 900 మంది విద్యార్థులకు ముగ్గురు, 900లకు పైగా విద్యార్థులుంటే నలుగురు ఆయాల చొప్పున నియమించారు. ఈ విధంగా జిల్లాలోని 1,379 పాఠశాలల్లో 1,445 మంది ఆయాలు, 180 మంది నైట్ వాచ్‌మెన్లను నియమించారు. వీరికి ప్రతి నెలా విద్యాశాఖ నుంచి రూ.6 వేల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యేది. కోస్తా జిల్లాల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు మినహా మిగిలిన వారు పెద్దగా ఆసక్తి చూపలేదు. కుటుంబ పోషణకు ఈ జీతం ఉపయోగపడుతుందనే ఆశతో పాటు, స్కూల్ విద్యార్థులకు సేవ చేస్తే తమ పిల్లలకు చేసినట్లుగా ఉంటుందని భావించి కొంతమంది మహిళలు ఆయాలుగా పనిచేస్తున్నారు. ఆయాలకు నాలుగు నెలలు, నైట్‌వాచ్‌మెన్లకు ఐదు నెలలుగా జీతాలు నిలిచిపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో జీవనం గడపడం కష్టతరమైపోతున్న తరుణంలో, జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, మే, జూన్ నెలల్లో కేవలం సగం జీతం మాత్రమే ఇచ్చారని వాపోతున్నారు. సెలవు రోజుల్లో ఉపాధ్యాయులకు పూర్తి జీతం ఇచ్చే ప్రభుత్వం, ఆయాలు, నైట్‌వాచ్‌మెన్ల పట్ల పక్షపాతం చూపడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. జీతాలు ప్రతి నెలా క్రమం తప్పక ఇవ్వాలని, మే, జూన్ నెలల్లో కూడా పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.
స్కూళ్లలో పనిచేసే ఆయాలు, నైట్‌వాచ్‌మెన్లకు నాలుగు నెలలుగా జీతాలు అందని మాట వాస్తవమే. వారి జీతాల బడ్జెట్ మంజూరైంది. జిల్లావ్యాప్తంగా 1,445 మంది ఆయాలు, 180 మంది నైట్‌వాచ్‌మెన్లు పనిచేస్తున్నారు. వీరందరికీ నాలుగైదు రోజుల్లో జీతాలు చెల్లించే ఏర్పాటు చేస్తున్నాం.
ఎం.సత్యనారాయణ, మధ్యాహ్న భోజన పథకం అసిస్టెంట్ డైరెక్టర్


