భీమడోలు: ద్వారకాతిరుమల దేవస్థానం ఆధీనంలో భీమడోలు, కామవరపుకోట జూనియర్ కళాశాల్లో అధ్యాపకులుగా, నాన్–టీచింగ్ సిబ్బందిగా మూడు దశాబ్దాలుగా పనిచేసినా.. కొన్నేళ్లుగా దేవస్థానం యాజమాన్యం ఎలాంటి బెనిఫిట్స్, ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా పదవీ విరమణ చేయించిందని అధ్యాపకులు, నాన్–టీచింగ్ సిబ్బంది వాపోయిరు. ఆదివారం భీమడోలులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు వద్ద తమ గోడును విన్నవించుకున్నారు. 5, 6 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ, పెన్షన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నవరం దేవస్థానంలో ఉద్యోగులు రిటైర్ కాగానే వారందరికీ అన్ని సదుపాయాలను కల్పించారని, బదిలీపై ఇక్కడకు వచ్చిన ఈవో ఇవ్వకపోవడం దారుణమని వాపోయారు. మా జీవితాలతో దేవస్థానం అధికారులు ఆడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్లు, ఇంక్రిమెంట్లు, పే స్కేల్స్ చెల్లించేలా తగు చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు.


