సీడబ్ల్యూసీ గణాంకాలు
ఈ మూడు నెలలే కీలకం
భద్రాచలం వద్ద ఆగస్టులో నమోదైన నీటిమట్టాలు
● ఏటా గోదావరికి భారీ వరదలు
● విలీన మండలాలపై తీవ్ర ప్రభావం
● ముంపు ప్రాంత ప్రజల గుండెల్లో దడ
వేలేరుపాడు : ఏటా జూలై నుంచి సెప్టెంబర్ వరకు గోదావరి నది వరదలు విలీన మండలాలను తీవ్రంగా వేధిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆగస్టు నెల వచ్చిందంటే చాలు, ఈ పరీవాహక ప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఈ ఏడాది జులైలో వరద ముప్పు తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఆగస్టులో గోదావరి తన ప్రతాపం చూపిస్తుండటంతో మళ్లీ ఆందోళన మొదలైంది.
పరిపాటిగా..
గత గణాంకాలను పరిశీలిస్తే, ఆగస్టులోనే తీవ్రస్థాయిలో వరదలు రావడం పరిపాటిగా మారింది. గోదావరి పొంగినప్పుడల్లా వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, వీఆర్ పురం, కూనవరం, ఎటపాక వంటి విలీన మండలాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఇళ్లు, రహదారులు, పంటపొలాలు నీట మునిగిపోవడం, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడం అక్కడ నిత్యకృత్యమైంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీతో ఆగస్టులో ఈ నది ఉగ్రరూపం దాలుస్తోంది.
ముఖ్యాంశాలు.. చారిత్రక ఆధారాలు
● ఆగస్టు ప్రాధాన్యం : గోదావరి ఇప్పటివరకు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి 23 సార్లు ప్రవహించగా, అందులో 12 సార్లు కేవలం ఆగస్టు నెలలోనే నమోదు కావడం గమనార్హం.
● 1986 బీభత్సం : చరిత్రలోనే అత్యంత తీవ్రమైన వరదలు ఆగస్టులోనే వచ్చాయి. 1986లో భద్రాచలం వద్ద గోదావరి 75.60 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకొని, 14 మండలాల్లో భారీ బీభత్సాన్ని సృష్టించింది.
● నాటి జ్ఞాపకాలు : భద్రాద్రి రామయ్య పాదాలను గోదారమ్మ తాకిన ఆనాటి నదీ విలయాన్ని ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ చేదు అనుభవాల తర్వాతే చాలామంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లి స్థిరనివాసాలు ఏర్పరుచుకున్నారు.
వరదల్లో ప్రజల కష్టాలు (ఫైల్)
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టాన్ని అడుగుల్లో కొలుస్తారు. ఇక్కడ 43 అడుగుల నీటిమట్టం నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులు వస్తే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు వస్తే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పటివరకు అత్యధికంగా 1986లో 75.60 అడుగులు, 2022లో 71.30 అడుగుల భారీ వరదలు వచ్చాయి. 1990లో 70.80 అడుగులు, 2006లో 66.90 అడుగులు, 1976లో 63.90 అడుగులు వరదలు వచ్చినట్లు సీడబ్ల్యూసీ గణాంకాలు చెపుతున్నాయి. ఈ ఐదు అత్యధిక వరదల్లో మూడు ఆగస్టులో రావడం గమనార్హం.
జులై, ఆగస్టు, సెప్టెంబర్‌లో గోదావరికి వర ద పోటెత్తుతుంది. ఇప్పుడే అధికారులకు వరదలు సవాల్‌గా నిలుస్తాయి. ఇప్పటివరకూ జూన్‌లో రెండుసార్లు అత్యధికంగా గోదావరిలో నీటిమట్టం నమోదైంది. 1976 జూన్‌లో 63.9 అడుగులకు వరద చేరింది. జూలైలో 10 సార్లు 53 అడుగులు దాటి వరదలు వచ్చాయి. ఇందులో 2022లో అత్యధికంగా 71.3 అడుగులు నమోదైంది. సెప్టెంబర్‌లో ఆరు సార్లు గోదావరికి వరదలు రాగా ఇందులో నాలుగు సార్లు మూడో ప్రమాద హెచ్చరిక దాటి నీటి మట్టం నమోదైంది. అక్టోబర్‌లో 1995లో మాత్రమే 57.6 అడుగుల వరద వచ్చింది.
సంవత్సరం నీటిమట్టం
అడుగుల్లో
1963 73.0
1977 49.9
1980 48.0
1981 58.9
1982 34.5
1983 63.5
1984 38.8
1985 36.9
సంవత్సరం నీటిమట్టం
అడుగుల్లో
1986 75.6
1990 70.8
1991 46.3
1992 52.9
1993 37.0
1996 30.0
1997 34.7
1999 41.1
సంవత్సరం నీటిమట్టం
అడుగుల్లో
2000 54.6
2001 53.8
2002 50.0
2004 37.6
2006 66.9
2007 53.7
2008 47.3
2009 31.0
సంవత్సరం నీటిమట్టం
అడుగుల్లో
2010 59.7
2012 46.4
2013 61.6
2018 34.8
2020 61.6
2022 51.6
2025 52.0
2026 55.9


