చాన్సలర్ అనుమతి ఉందా?
● అడ్డదారిలో ట్రిపుల్‌ఐటీలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు
● ఇటీవల పది మంది నియామకం
● ఉద్యోగానికి రూ.3 లక్షల వసూలు!
నూజివీడు: నాణ్యమైన విద్యకు కేరాఫ్‌గా నిలిచిన నూజివీడు ట్రిపుల్‌ఐటీ అక్రమాలు, అవకతకలకు నిలయంగా మారింది. డబ్బు కొట్టు.. ఉద్యోగం పట్టు అన్న రీతిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా అవసరం లేకున్నా పది మందికి పోస్టింగ్‌లు ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. దాదాపు రూ.30 లక్షల వరకు చేతులు మారినట్టు ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌తో పాటు పట్టణంలోని రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ గా మారింది. ల్యాబ్ అసిస్టెంట్ల పేరుతో తీసుకుని ఎగ్జామ్ సెల్‌లో, మరికొందరిని అటెండర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా తీసుకుని ఏఓ ఆఫీసు, ప్రొక్యూర్‌మెంట్, డీన్ ఆఫీసుల్లో నియమించినట్టు సమాచారం. ఒంగోలు ట్రిపుల్‌ఐటీ పేరుతో శక్తి సెక్యూరిటీ అండ్ మెయింట్‌నెన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా వీరిని నూజివీడు ట్రిపుల్‌ఐటీలోకి తీసుకున్నారు.
నిబంధనలు పాటించరా?
నిబంధనల మేరకు ముందుగా అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగులు కావాలని, అర్హులైన సంస్థలు ముందుకు రావొచ్చని పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ ఇవేమీ పాటించలేదు. డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలకు ఇది బలం చేకూరుతోంది. అలాగే ఒంగోలు పేరుతో నూజివీడుకు చెందిన వారిని తీసుకుని ఉద్యోగాలు ఇస్తుంటే ఒంగోలు జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులు చూస్తూ ఊరుకుంటారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ట్రిపుల్‌ఐటీల్లో ఏ నియామకమైనా చేయాలంటే తప్పనిసరిగా చాన్సలర్ ఉంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. అంతేగాకుండా గవర్నింగ్ కౌన్సెల్ సమావేశ అజెండాలో ఉంచి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అవేమీ లేకుండానే ఈ నియామకాలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విచారణ చేసి వాస్తవాలను వెల్లడిస్తేనే ఆరోపణలకు, విమర్శలకు తెరపడనుంది.


