ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం సీ్త్ర శక్తి పేరుతో ప్రారంభించింది. అన్ని బస్సుల్లో ఉచితమని భావించిన మహిళలకు నిరాశే ఎదురైంది. కేవలం 5 రకాల బస్సుల్లోనే అనుమతి ఇవ్వగా, అందులోనూ గ్రామీణ ప్రాంతాలకు అనుకూలంగా పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో రెండు వారాల్లో ఈ పథకం మొదటి వార్షికోత్సవం జరుపుకోనున్నప్పటికీ, మహిళల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రధానంగా డ్రైవర్లు, కండక్టర్లు మహిళా ప్రయాణికుల పట్ల తీవ్ర అనాసక్తి చూపుతున్నారు. మహిళలు బస్ స్టాప్‌లలో కనిపిస్తే బస్సులు ఆపకుండా వేగంగా వెళ్తున్నారు.
ఖాళీగా ఉన్నా ఆపకుండా.. తాజాగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి నాలుగింట ఒక వంతు (60) బస్సులను తరలించడంతో ప్రధాన రూట్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిమితంగా తిరుగుతున్న బస్సుల్లోనూ మహిళలను ఎక్కించుకోవడానికి సిబ్బంది నిరాకరించారు. ‘వెనుక మరో బస్సు వస్తోంది’ అని చెబుతూ వెళ్లిపోవడంతో మహిళలు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. బస్సులు ఖాళీగా ఉన్నప్పటికీ ఆపకపోవడంతో కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే మహిళలు, విద్యార్థినులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
బస్సులను వెంబడిస్తూ..
శనివారం ఉదయం సుమారు 8.30 గంటల ప్రాంతంలో ఏలూరు కొత్త బస్టాండు నుంచి మచిలీపట్నం డిపోకు చెందిన ఏపీ 39 యూజీ 9495 నంబర్ బస్సు బయలు దేరింది. ఆ సమయంలో బస్సు ఖాళీగానే ఉంది. అప్పుడే బస్టాండులోకి ప్రవేశిస్తున్న ఒక మహిళ బస్సు ఆపాలంటూ చేయి ఎత్తినా డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. అయితే ఆ మహిళ ద్విచక్రవాహనంపై బస్సును వెంబడించి సత్రంపాడులో ఎక్కాల్సి వచ్చింది. సత్రంపాడులో కూడా బస్టాప్‌లో ఎక్కువ మంది మహిళలు ఉండటాన్ని గమనించి సదరు డ్రైవర్ బస్సును ఆపకుండా కొద్దిగా ముందుకు వెళ్లి సిద్ధార్థ స్కూల్ వద్ద ఆపడంతో ఆ మహిళలు ఆ బస్సును ఎక్కలేకపోయారు. మహిళలను ఎక్కించుకోవద్దని అధికారుల నుంచి సిబ్బందికి లోపాయికారి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బస్సులన్నీ భోగాపురానికి..
తిరిగే కొన్ని బస్సుల్లోనూ మహిళలకు నిరాకరణ
ఖాళీగా ఉన్నా ఆపకుండా వెళ్లిన వైనం
లోపాయికారి ఆదేశాల మేరకేనా..?


