కాలేయంలో అరుదైన తిత్తి తొలగింపు | - | Sakshi
Sakshi News home page

కాలేయంలో అరుదైన తిత్తి తొలగింపు

Aug 2 2026 12:58 AM | Updated on Aug 2 2026 12:58 AM

కాలేయంలో అరుదైన తిత్తి తొలగింపు చిన్నతిరుపతిలో భక్తుల రద్దీ సాధారణం 22, 23 తేదీల్లో విశ్రాంత ఉద్యోగుల ఎన్నికలు 6 నుంచి అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీలు

తణుకు అర్బన్‌: కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కాకర్లమూడి సాయికిరణ్‌ తెలిపారు. రోగి బి.ఇస్రాయేల్‌ (62) కాలేయ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా, వైద్య పరీక్షల అనంతరం ఆస్పత్రిలోని సీనియర్‌ జనరల్‌ సర్జరీ వైద్యుడు డాక్టర్‌ చక్రధర్‌ శస్త్రచికిత్స చేసి కాలేయంలో ఉన్న అరుదైన తిత్తిని తొలగించినట్లు వివరించారు. మత్తు వైద్యుడు డాక్టర్‌ శ్రీనివాసరాజు, వైద్య బృందం ఎంతో శ్రమించి ఈ అరుదైన శస్త్రచికిత్సను చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

ద్వారకాతిరుమల: చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగింది. ఆషాఢ మాసం కావడంతో పాటు, తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షం కారణంగా భక్తుల రాక తగ్గింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, దర్శనం క్యూ లైన్లు, కల్యాణకట్ట, ప్రసాదాల విక్రయాల కౌంటర్ల వద్ద సాయంత్రం వరకు భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించింది. వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారికి మొక్కులు చెల్లించుకుని, దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఏలూరు (టూటౌన్‌): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్‌ రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఆగస్టు 22, 23 తేదీలలో ఏలూరులో జరుగుతాయని ఎన్నికల అధికారి, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.సోమశేఖర రావు తెలిపారు. శనివారం స్థానిక కోట దిబ్బలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్‌ ఏలూరు జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆగస్టు ఒకటో తేదీ ఉదయం 11 గంటల నుంచి ఆగస్టు రెండో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఓటరు లిస్టు నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆగస్టు 3 న ఫైనల్‌ ఓటరు లిస్టును ప్రకటిస్తామన్నారు. ఆగస్టు 22వ తేదీన ఏలూరులోని నేరెళ్ళ రాజా మర్చంట్‌ చాంబర్స్‌ కల్యాణ మండపంలో నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. పోటీ తప్పనిసరి అయితే ఆగస్టు 23న ఎన్నిక జరుగుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈనెల 6వ తేదీ నుంచి జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్‌ షిప్‌ 2026 అంతర్‌ నియోజకవర్గాల క్రీడా పోటీలు, ఎంపికలు నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌.ఏ.అజీజ్‌, సెట్‌వెల్‌ సీఈఓ కె.ఎస్‌.ప్రభాకర రావు, స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ పి.అలివేలు మంగ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని అల్లూరి సీతారామ రాజు స్టేడియంలో ఈ నెల 6 నుంచి 12 క్రీడాంశాలలో ఈ పోటీలు, ఎంపికలు జరుగుతాయన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 6వ తేదీన ఏలూరు అల్లూరి సీతారామ రాజు స్టేడియంలో అండర్‌–17 (బాలురు – బాలికలు), అండర్‌–23 (పురుషులు – మహిళలు) విభాగాలకు ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, బాక్సింగ్‌, హాకీ పోటీలు జరుగుతాయన్నారు. నగరంలోని ఏఆర్‌డీజీకే నగరపాలక ఉన్నత పాఠశాలలో చెస్‌ పోటీలు జరుగుతాయని తెలిపారు. 6, 7 తేదీల్లో అల్లూరి సీతారామ రాజు స్టేడియంలో కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్‌ పోటీలు, ఇండోర్‌ స్టేడియంలో వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు, యోగా ట్రైనింగ్‌ సెంటర్‌లో యోగా పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ పోటీలలో జిల్లా స్థాయిలో ఎంపికై న వారు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొనడానికి ఎంపికవుతారని, రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన బాలురు, బాలికలకు మొత్తం రూ.94 లక్షల నగదు బహుమతులు లభిస్తాయన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ 9948779015లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement