నూజివీడు: జాతీయ క్వాంటం మిషన్ కింద నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఏర్పాటు చేసిన అండర్ గ్రాడ్యుయేట్ క్వాంటం టెక్నాలజీస్ బోధనా ప్రయోగశాల ప్రాజెక్టును సమీక్షించేందుకు భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ ఉన్నత స్థాయి బృందం శనివారం ట్రిపుల్‌ఐటీని సందర్శించింది. దీనిలో భాగంగా జాతీయ క్వాంటం మిషన్ డైరెక్టర్ జే.బి.వి.రెడ్డి, ఏపీ స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ శ్రీధర్ సి.వి., టీ హబ్ సీఈఓ విజయ్ ఏ.రామానుజన్‌లతో పాటు ఆర్జీయూకేటీ ఛాన్సలర్ ఆచార్య కొత్తా మధుమూర్తి, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ఆచార్య కె.ఎన్.సత్యన్నారాయణలు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన క్వాంటం టెక్నాలజీ పోస్టర్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ పోస్టర్ల ద్వారా విద్యార్థులు తమ సాంకేతిక ఆలోచనలు, పరిశోధనా విధానాలు, భవిష్యత్ అనువర్తనాలపై రూపొందించిన ప్రతిపాదనలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉన్నత స్థాయి బృందం జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాల గురించి వివరించారు. క్వాంటం టెక్నాలజీలో మైనర్ డిగ్రీ అభ్యసిస్తున్న విద్యార్థులతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సమావేశం నిర్వహించారు. క్వాంటం హార్డ్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌లు, క్వాంటం అల్గోరిథంలు, పరిశోధనా అవకాశాలు, ఉన్నత విద్య, అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ అవకాశాలు వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు, రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, డీన్ ఆఫ్ అకడమిక్స్ దువ్వూరు శ్రావణి తదితరులు పాల్గొన్నారు.


