ఇప్పటికే లేటు.. ఎక్కడుంది బోటు? | - | Sakshi
Sakshi News home page

ఇప్పటికే లేటు.. ఎక్కడుంది బోటు?

Aug 1 2026 12:52 AM | Updated on Aug 1 2026 12:52 AM

ఇప్పటికే లేటు.. ఎక్కడుంది బోటు?

వరద ముంచుకొస్తున్నా కానరాని లాంచీలు

పెరుగుతున్న గోదావరి వరద

వేలేరుపాడు: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రికి నీటిమట్టం 51.20 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయానికి మూడో ప్రమాద హెచ్చరిక వెలువడే అవకాశముంది. అయితే ఏటా జూన్‌ 15 కల్లా చేపట్టాల్సిన వరద సహాయక చర్యలను అధికారులు ఇంకా ప్రారంభించకపోవడం గమనార్హం. అత్యవసర సమయంలో అందుబాటులో ఉండాల్సిన లాంచీలు, బోట్లు లేకపోవడంతో ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మహారాష్ట్ర సహా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటికి తోడు, భద్రాచలం–రాజమండ్రి మధ్య ఉన్న ఉపనదుల వల్ల గోదావరికి ఆకస్మికంగా వరద పెరుగుతుంది. సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు ఉండే ఈ వరద సీజన్‌లో ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి, నిత్యావసరాలు అందించడానికి లాంచీలే ఏకైక ఆధారం. అత్యవసర సమయంలో లాంచీలను రా జమండ్రి నుంచి ఎగువకు (ఎదురీతపై) తీసుకురావడం చాలా సమయంతో కూడుకున్న పని.

7 మండలాలకు పొంచి ఉన్న ముప్పు

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయితే ఏలూరు, అల్లూరి సీతారామరాజు/తూర్పు గోదావరి (పోలవరం, రంపచోడవరం) జిల్లాల పరిధిలోని 7 మండలాల్లోని 167 గ్రామాలు నీట మునుగుతాయి. మండలాల వారీగా వేలేరుపాడులో 36, కుక్కునూరులో 28, పోలవరంలో 19, కూనవరంలో 48, వీఆర్‌ పురంలో 30, చింతూరులో 6 గ్రామాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో ముంపునకు గురయ్యే ప్రజల ప్రాణాలు కాపాడటానికి, నిత్యావసరాలు అందించడానికి ఏటా 25 లాంచీలు, 100 మంది సిబ్బంది అవసరమవుతారు. అధికారులు వెంటనే స్పందించి లాంచీలను స్థానిక రేవుల్లో అందుబాటులో ఉంచాలని ముంపు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement