వేలేరుపాడు: గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజులుగా పడుతున్న ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 51.20 అడుగులకు చేరింది. దీంతో వేలేరుపాడు మండలంలోని 32 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని, మండల కేంద్రంతో సంబంధాలు కోల్పోయాయి. పెదవాగు, ఎద్దెలవాగు, టేకూరు, మేళ్లవాగుల ద్వారా గోదావరి నీరు చేరి ప్రధాన రహదారులన్నీ మునిగిపోయాయి. మరో 7–8 అడుగులు పెరిగితే ఇళ్లన్నీ నీట మునుగుతాయని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరించారు. బాధితుల రవాణాకు అధికారులు నాటుపడవలు ఏర్పాటు చేశారు. రేపాకగొమ్ముతో పాటు ఇతర ముంపు గ్రామాల ప్రజలను తాడువాయి పునరావాస కాలనీకి తరలిస్తున్నారు. ఇప్పటివరకు 70 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు.


