టార్గెట్‌ ఫిక్స్‌.. ట్రాన్స్‌ఫర్‌ ట్రిక్స్‌ | - | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ ఫిక్స్‌.. ట్రాన్స్‌ఫర్‌ ట్రిక్స్‌

Jul 31 2026 1:09 AM | Updated on Jul 31 2026 1:09 AM

టార్గెట్‌ ఫిక్స్‌.. ట్రాన్స్‌ఫర్‌ ట్రిక్స్‌

శ్రీవారి దేవస్థానంలో ముదిరిన అధికారుల బదిలీల రాజకీయం

ఎలక్ట్రికల్‌ డీఈని రిలీవ్‌ చేసిన అధికారులు

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానంలో అధికారుల బదిలీల వెనుక తీవ్ర రాజకీయ జోక్యం ఉందన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ నేతలు డిప్యూటేషన్ను అస్త్రంగా చేసుకుని, తమకు అనుకూలంగా లేని అధికారులతో పాటు, దేవస్థానం ఛైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు, ఆయన కుమారుడు నివృతరావులకు మద్దతుగా ఉన్న అధికారులను లక్ష్యంగా చేసుకుని ఒక్కొక్కరిగా సాగనంపుతున్నారనే ప్రచారం నడుస్తోంది. ఇటీవల లక్ష్మీపురంలో దేవస్థానం భూమిని కొందరు అధికార పార్టీ నాయకులు ఆక్రమించిన వ్యవహారంలో భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాము వివాదంలో చిక్కుకోవడానికి అధికారులే కారణమని భావించిన నేతలు వారిపై కక్ష పూనినట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

హఠాత్తుగా డీఈ రిలీవ్‌

ఈ పరిణామాల్లో భాగంగా ఎలక్ట్రికల్‌ డీఈ టి.సూర్యనారాయణను హఠాత్తుగా రిలీవ్‌ చేశారు. 2022లో ఆయన్ను ద్వారకాతిరుమల నుంచి అన్నవరానికి బదిలీ చేసినా, తదుపరి ఉత్తర్వుల ప్రకారం ఆయన ద్వారకాతిరుమలతో పాటు సింహాచలంలో సేవలు అందిస్తున్నారు. అయితే, పాత 2022 నాటి బదిలీ ఉత్తర్వులను ఆధారంగా చూపిస్తూ గురువారం అకస్మాత్తుగా ఆయన్ను రిలీవ్‌ చేసి అన్నవరం వెళ్లాలని ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.

తదుపరి టార్గెట్‌ ఎవరో..

ఎలక్ట్రికల్‌ డీఈ తర్వాత బదిలీల జాబితాలో తదుపరి టార్గెట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) డీవీ భాస్కర్‌ అని ప్రచారం జరుగుతోంది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న అంశం ఆలయ ప్రాంగణంలో ఆసక్తికరంగా మారింది. ఆలయ భూముల కబ్జాపై మాట్లాడకుండా, నేతలకు లొంగిపోని అధికారులపై ఇలా కక్షసాధింపు చర్యలకు దిగడంపై స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుని పరిపాలనలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోవడం పట్ల ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement