రైళ్లలో చోరీలు చేస్తున్న వ్యక్తి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

రైళ్లలో చోరీలు చేస్తున్న వ్యక్తి అరెస్టు

Jul 30 2026 1:21 AM | Updated on Jul 30 2026 1:21 AM

భీమవరం : వ్యసనాలకు అలవాటుపడి రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసి, అతని వద్ద నుంచి 58 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం భీమవరం రైల్వే ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం, ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఎస్‌ఐ రెహ్మాన్‌, సీఈబీ ఎస్‌ఐ ఎం. రమేష్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన మరలపూడి పవన్‌ జూదం, మద్యానికి బానిసయ్యాడు. జాలీగా జీవించేందుకు దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. గతంలో ఉండి, భీమవరం టౌన్‌, తాడేపల్లిగూడెం టౌన్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో బైక్‌ చోరీలకు పాల్పడటంతో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల రాజమహేంద్రవరం టూటౌన్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి కేసులో జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం పవన్‌ రైళ్లలో ప్రయాణికుల వద్ద బంగారం చోరీకి పాల్పడ్డాడు. ఆ సొత్తును విక్రయించేందుకు బుధవారం భీమవరం జంక్షన్‌ రైల్వే స్టేషన్‌లోని 2వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పైకి రాగా, ముందస్తు సమాచారంతో తనిఖీలు చేస్తున్న రైల్వే సిబ్బందిని చూసి పారిపోయేందుకు యత్నించాడు. సిబ్బంది చాకచక్యంగా వెంబడించి అతడిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 25 గ్రాముల నల్లపూసల తాడు, 33 గ్రాముల సూత్రాల తాళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

58 గ్రాముల బంగారం స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement