ద్వారకాతిరుమల: ప్రత్యంగిరి దేవి అనుగ్రహం కోసం భక్తులు నిర్వహించిన అరుదైన కారాభిషేకం దొరసానిపాడులో ప్రత్యేకతను సంతరించుకుంది. స్థానిక శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో బుధవారం ముందుగా పూర్ణాహుతి హోమం, దీపోత్సవం జరిపారు. అనంతరం ప్రత్యంగిరి దేవి ఆవాహనలో ఉన్న శివస్వామికి సుమారు 60 కిలోల ఎర్రని కారంతో భక్తులు అభిషేకం చేశారు. ఈ విశేష పూజలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ పురాణాల ప్రకారం హిరణ్యకశిపుని సంహారం తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపాన్ని శాంతింపజేసేందుకు ప్రత్యంగిరి దేవి అవతరించిందని తెలిపారు. దేవికి ఎండు మిరపకాయలు ప్రీతిపాత్రమైనవి కావడం వల్ల వాటిని హారాలుగా అలంకరించి పూజిస్తారన్నారు. దేవి ఆవాహనలో ఉన్న తనకు కారంతో అభిషేకం చేయడం వల్ల కష్టాలు తొలగి, శత్రు నివారణతో పాటు లక్ష్మీకటాక్షం లభిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గత 30 ఏళ్లుగా ఈ కారాభిషేకాన్ని నిర్వహిస్తున్నామని, దొరసానిపాడులో ఇది వరుసగా నాలుగో ఏడని ఆయన వివరించారు.


