ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్ కూటమి ప్రభుత్వానికి తొత్తులా పనిచేస్తున్నారని, తమ సమస్యలపై ఎన్నిసార్లు కలిసినా కనీస మర్యాద కూడా ఇవ్వకుండా స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) విమర్శించారు. కూటమి నాయకుల కనుసన్నల్లో కావాలనే తమను ఇబ్బంది పెడుతున్నారంటూ సాక్షాత్తు కలెక్టర్ వెట్రిసెల్వి ఎదుటే నిలదీశారు. ఈ సందర్భంగా కమిషనర్ భానుప్రతాప్ వైఎస్సార్‌సీపీ నాయకులతో వాగ్వాదానికి దిగడంతో కలెక్టర్ ఆయన్ను పక్కకు పంపించి వేశారు. అనంతరం కలెక్టరేట్ బయట జయప్రకాష్ విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహం చుట్టూ గ్రానైట్ మరమ్మతులు చేయించే విషయంలో ఇప్పటికే పీజీఆర్‌ఎస్‌లో పలుమార్లు వినతిపత్రం అందించామన్నారు. దీనిపై కమిషనర్‌కు కలెక్టర్ లేఖ పంపగా తాము కమిషనర్‌ను ఆయన చాంబర్‌లో కలిశామన్నారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకులన్న మర్యాద లేకుండా కనీస గౌరవం ఇవ్వకుండా కమిషనర్ మాట్లాడారని మండిపడ్డారు. ఈ విషయంలో కమిటీ వేస్తామని చెప్పి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. గతంలో మున్సిపల్ నిధులతో వైఎస్సార్ విగ్రహాన్ని నిర్మించారని గుర్తుచేశారు. 2023లో ఇడా ఆధ్వర్యంలో బ్యూటిఫికేషన్ పేరుతో విగ్రహం చుట్టూ గ్రానైట్‌ను తొలగించారని.. పనులు మొదలు పెట్టేలోపు ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయన్నారు. అప్పటి నుంచి మీరైనా బాగు చేయండి, లేదంటే తామైనా బాగు చేయించుకునేందుకు అనుమతి ఇప్పించాలని మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. అలాగే జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణం విషయంలోనూ అన్ని అనుమతులు ఉన్నా ఎన్‌ఓసీ ఇవ్వకుండా కావాలనే ఇబ్బంది పెడుతున్నారన్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా విద్యుత్ సరఫరాను కట్ చేయించడం, ఎన్‌ఓసీ ఇవ్వకపోవడం వంటి చర్యలు ఏకపక్షంగా తీసుకుంటున్నారన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కమిషనర్‌పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, నాయకులు నూకపెయ్యి సుధీర్‌బాబు, మున్నుల జాన్ గురునాథ్, గంటా మోహనరావు, జిజ్జువరపు విజయనిర్మల, నెరుసు చిరంజీవులు, ప్రత్తిపాటి తంబి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు


