ఏలూరు (టూటౌన్): ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని బీడీ కాలనీ క్రాంతినగర్‌లో శనివారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వ పోరంబోకు భూమిలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారిని ఖాళీ చేయాలని, వారి ఇళ్లను కూల్చివేసేందుకు నగరపాలక సంస్థ సిబ్బంది శనివారం ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న స్థానికులు పెట్రోలు డబ్బాలతో పొక్లెయిన్‌కు ఎదురు నిలవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో మున్సిపల్ సిబ్బంది ఇళ్ల కూల్చివేతను తాత్కాలికంగా నిలుపుదల చేసి వెనుదిరిగారు. స్థానికుల వివరాల ప్రకారం.. బీడీ కాలనీ క్రాంతినగర్‌లో దాదాపు 90 కుటుంబాలకు చెందిన వారు గత 15 సంవత్సరాలుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పోరంబోకు భూమిలో ఇళ్లను నిర్మించుకున్నారు. సమీపంలో వేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్‌కు వెళ్లేందుకు వీలుగా కామన్ సైట్‌లో ఇళ్లు నిర్మించారంటూ వాటిని తొలగించాలని శుక్రవారం నోటీసులు జారీ చేశారు. నోటీసులను ఇళ్ల వద్ద ఎవరూ లేని సమయంలో ఇంటి తలుపులకు అంటించారు. శుక్రవారం నోటీసులు అంటించి శనివారం ఉదయం ఇళ్లను కూల్చివేసేందుకు యంత్రాలతో సహా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలకు ముందు స్థానిక టీడీపీ నాయకుడొకరు తమ పార్టీ అధికారంలోకి వస్తే మీ అందరికీ పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న గూడును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పోరంబోకు భూమి రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన కామన్ సైట్ ఎలా అవుతుందంటూ బాధితులు నిలదీస్తున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా తక్షణం తమకు పక్కా పట్టాలిచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. తమలాంటి నిరుపేదలపై జులుం ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమంటూ వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని తమకు పట్టాలిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక బాధిత ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
పెట్రోల్ డబ్బాలతో స్థానికుల ఆందోళన


