రైతులకు చుక్కలు చూపిస్తున్న ఎలుకలు
ఉపయోగించే విధానం
జాగ్రత్తలు అవసరం
సామూహికంగా చేస్తే ఫలితం
● రబీ ప్రారంభంలోనే
పెరిగిన ఎలుకల బెడద
● అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు
పాలకొల్లు సెంట్రల్: రబీసాగుకు తొలిదశలోనే ఎలుకల బెడద మొదలైంది. వరిపంటను నాశనం చేస్తూ రైతులకు ఎలుకలు చుక్కలు చూపిస్తున్నారు. చెందుతున్నారు. వ్యవసాయ డివిజన్ పాలకొల్లు, పోడూరు, ఆచంట మండలాల్లో, అలాగే నియోజకవర్గ స్థాయిలో లెక్కిస్తే యలమంచిలి మండలంలో మొత్తం కలిపి సుమారు 40,500 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ప్రస్తుతానికి పంట మొదటి దశలో ఉండడంతో తొలిదశలోనే ఎలుక దాడి చేయడంతో రైతులు కంటిమీద కునుకులేకుండా ఉన్నారు. ఎన్ని రసాయన మందులు పిచికారీ చేస్తున్నా ఎలుకలు మాత్రం నియంత్రించడం సాధ్యం కావడంలేదని రైతులు వాపోతున్నారు. ముందుగా ఊడ్చిన, వెదజల్లిన ప్రాంతాల్లో వరిమొనలను నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు.
ఫలితాలు ఇవ్వని నివారణ చర్యలు
ఎలుకలను నివారించడానికి రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కావడంలేదు. వరి నూకలను నూనె రసాయనిక మందులను తగిన మోతాదులో కలిపి పొట్లాలు కలిపి ఎలుక కన్నాల్లో పెడుతున్నా పలితం లేదంటున్నారు. దాంతో ఎలుకల బుట్టలు లేదా పొగబెట్టే విధానంలో ముందుకు వెళ్దామన్నా అది అధిక ఖర్చుతో కూడకున్న పని కావడంతో రైతులు వ్యవసాయశాఖ అధికారుల సూచనలపై ఆధారపడ్డారు. వ్యవసాయశాఖ అధికారులు ఎలుకల నివారణ కోసం రైతులకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. నూకలు, నూనెలతో పాటు ప్రభుత్వం ఉచితంగా అందించే బ్రోమోడయోలిన్ మందును కలిపి పెట్టడం వల్ల ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు.
విషపు ఎర తయారీ విధానం
480 గ్రాముల నూకలకు 10 గ్రాముల నూనె కలిపి దానికి 10 గ్రాముల బ్రోమోడయోలిన్ పొడి మందు కలిపితే 500 గ్రాముల విషపు ఎర తయారవుతుంది.
ఈ పొడి మందు 10 గ్రాముల చొప్పున కాగితంతో పొట్లాలు కట్టుకోవాలి. ఆ విధంగా పొట్లాలు కట్టుకొని ఒకొక్క ఎలుక కన్నానికి ఒకొక్క పొట్లం చొప్పున ఉంచుకోవాలి. మొదటి రోజు ఎలుక కన్నాలను మట్టితో పూడ్చాలి. రెండవ రోజు తెరువబడిన కన్నాలను బ్రోమోడయోలిన్ విషపు ఎర పొట్లాన్ని కన్నానికి ఒకటి చొప్పున ఉంచాలి. పదో రోజు తెరిచి ఉన్న కన్నాలను గుర్తించి మళ్లీ బ్రోమోడయోలిన్ పొట్లాన్ని బొరియ దగ్గర ఉంచాలి. పదిహేనో రోజు తెరిచిన కన్నాలను లెక్కించి ఫలితాన్ని గమనించుకోవాలి.
మందు కలిపినప్పుడు చేతులకు గ్లౌజులను వేసుకోవాలి. మందు విషపూరితం కాబట్టి తయారు చేసిన రోజునే బోరియల దగ్గర ఉంచాలి. పిల్లలకు, పశువులకు అందుబాటులో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విరుగుడు మందు విటమిన్ కే–1 ను అందుబాటులో ఉంచుకోవాలి. రైతులు ఆయా పరిధిలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారి, మండల వ్యవసాయాధికారి సూచనలు పాటిస్తూ సామూహికంగా ఎలుకల నివారణా కార్యక్రమాన్ని చేపడితే పలితాలు ఆశించవచ్చని అధికారులు చెబుతున్నారు. సమర్థ ఎలుకల నివారణకు విషపు ఎరను ఉంచడంతోపాటు యాంత్రిక, సేద్య పద్ధతులను కూడా అనుసరించాలని సూచిస్తున్నారు.
ఎలుకలను నివారించేందుకు సామూహిక ఎలుకల నివారణా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గ్రామస్థాయిలో రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. బ్రోమోడయోలిన్ 0.25 సీబీ ఎలుకల మందు ఉచితంగా రైతులకు పంపిణీ చేస్తున్నాం. ఎర తయారీకి అవసరమైన నూకలు, నూనె రైతులు సేకరించుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, పోరంబోకు స్థలాల్లో పెట్టే ఎరకు అయ్యే ఖర్చును గ్రామ పంచాయితీలే భరించాలి. 500 గ్రాముల విషపు ఎర సుమారుగా 2.5 ఎకరాల పొలంలో ఉండే 50 కన్నాలకు సరిపోతుంది. – మురళీకృష్ణ, సహాయ సంచాలకుడు, పాలకొల్లు
రైతులకు చుక్కలు చూపిస్తున్న ఎలుకలు


