ప్రజాగ్రహంలో కొట్టుకుపోతారు
ఉంగుటూరు: పేదలు, సామాన్యులకు మెడికల్ విద్యను దూరం చేస్తే చంద్రబాబు సర్కార్ ప్రజాగ్రహాంలో కొట్టుకుపోతుందని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. ఉంగుటూరు మండలం రావులపర్రులో ఆదివారం రాత్రి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి మండల అధ్యక్షుడు మరడ మంగారావు అధ్యక్షత వహించారు. వాసుబాబు మాట్లాడుతూ పేదలు, సామాన్యుల ఆరోగ్య భద్రత కోసం కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. చంద్రబాబు కార్పొరేట్ పక్షపాతి అని, బడుగు, బలహీన వర్గాలంటేనే చిన్న చూపు అని వారు ఎదగడాన్ని ఓర్వలేడన్నారు. ప్రైవేటీకరణను ఆపకుంటే చంద్రబాబు చరిత్రహీనుడు కాక తప్పదని, వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కార్‌కు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు పుప్పాల గోపి, బీసీ సెల్ నాయకులు పెనుగొండ బాలకృష్ణ, జిల్లా నాయకులు ఎలిశెట్టి బాబ్జి, నీలిమ జూనియర్, గాది రమణ పాల్గొన్నారు.


