ధాన్యం కమీషన్‌.. సొసైటీల పరేషాన్‌ | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కమీషన్‌.. సొసైటీల పరేషాన్‌

Nov 2 2025 9:32 AM | Updated on Nov 2 2025 9:32 AM

ధాన్యం కమీషన్‌.. సొసైటీల పరేషాన్‌

ధాన్యం కమీషన్‌.. సొసైటీల పరేషాన్‌

సుమారు రూ.92 కోట్లు బకాయిలు పడ్డ కూటమి ప్రభుత్వం

ఆర్థిక భారంతో కష్టతరంగా సొసైటీల మనుగడ

భీమవరం: ధాన్యం కొనుగోలు కమీషన్‌ అందక సహకార సంఘాల మనుగడ కష్టతరంగా మారింది. కూటమి ప్రభుత్వం జిల్లాలోని సహకార సంఘాలకు సుమారు రూ.92 కోట్లు బకాయిలు పడడంతో వాటిని వెంటనే చెల్లించాలని సహకార సంఘాల పాలకవర్గాలు, ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఒకప్పుడు రైతులనుంచి మిల్లర్లు, ధాన్యం కమీషన్‌ ఏజెంట్ల ధాన్యం కొనుగోలు చేసేవారు. దీంతో వారి ఇష్టారాజ్యంగా ఉండేది. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులనుంచి ధాన్యం కొనుగోలు చేపట్టడంతో మిల్లర్లు, ఏజెంట్ల హవాకు గండిపడింది. ధాన్యం అమ్ముకున్న రైతులకు వారి బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం సొమ్ములు జమచేయడంతో రైతుల సంతోషానికి అవధుల్లేవు. రైతు భరోసా కేంద్రాలతోపాటు సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయిస్తూ సహకార సంఘాలు ధాన్యం కొనుగోలు చేసినందుకు క్వింటాళ్లకు సుమారు రూ.32.50 కమీషన్‌ చెల్లించేది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 122 సహకార సంఘాలుండగా వాటిలో 115 సంఘాలు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి. కాగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సహకార సంఘాలకు ధాన్యం కొనుగోలు కమీషన్‌ సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో దాదాపు రూ.92 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. కమీషన్‌ సొమ్ములు బకాయి పడడంతో ప్రస్తుత సార్వా సీజన్‌లో ధాన్యం కొనుగోలులో వాటి పాత్ర ఏమిటనేది ప్రశ్నర్థాకంగా మారింది. కమీషన్‌ బకాయిలు చెల్లించాలని ఇటీవల సహకార సంఘాల పాలకవర్గాలు, అధికారులు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు.

సంచుల భారం సైతం సొసైటీలదే

అసలే ధాన్యం కొనుగోలు కమీషన్‌ అందక అవస్థలు పడుతున్న సహకార సంఘాలకు రైతులకు ఇవ్వాల్సిన సంచుల భారం కూడా పడడంతో రవాణా, హమాలీల చార్జీలతో తలకుబొప్పికడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో రైతులకు ధాన్యం పట్టుబడికి సంచులు రైస్‌ మిల్లర్ల నుంచి సరఫరా అవుతుండగా జిల్లాలో సహకార సంఘాలు సరఫరా చేయాలని అధికారులు ఆదేశించడం విడ్డూరంగా ఉందని సహకార సంఘాల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైస్‌ మిల్లర్ల నుంచి సహకార సంఘాలు సంచులు తెచ్చి రైతులకు ఇవ్వాల్సి ఉండడంతో వారినుంచి వచ్చే సంచుల కట్టల్లో తక్కువగా ఉండడం, చిరిగిన సంచులు రావడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన టార్ఫాలిన్స్‌ కూడా సహకార సంఘాలే సమకూర్చాలని ఆదేశించడం సంఘాలకు ఆర్థిక భారంగా మారిందంటున్నారు. దీనికితోడు రైతు సేవా కేంద్రాల్లోని కొందరు అధికారులు ధాన్యం కమీషన్‌ ఏజెంట్లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో ఇప్పటికే తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా మిగిలిన చోట్ల మరో 10, 15 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కమీషన్‌ సొమ్ములు చెల్లిస్తే సహకార సంఘాలు మనుగడ సాగిస్తాయని లేకుంటే ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement