మహిళ అదృశ్యంపై కేసు నమోదు
టి.నరసాపురం: మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. మండలంలోని మెట్టగూడెం గ్రామానికి చెందిన ములికి మహాలక్ష్మికి వివాహమై ఒక పాప ఉంది. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ముత్యాలమ్మపేట గ్రామ శివార్లలో గల కాంచనమాల పామాయిల్ తోటలో మకాం ఉంటున్న కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది. ఈ నెల 24న బొర్రంపాలెం బ్యాంకు పని నిమిత్తం వెళ్లి తిరిగి రాలేదు. ఆమె తండ్రి కలవకొల్లి వెంకన్న ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
ఆగిరిపల్లి : లారీ ఢీకొని మహిళ దుర్మరణం చెందిన ఘటన మండలంలోని అడవినెక్కలంలో చోటు చేసుకుంది. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామానికి చెందిన దేవరశెట్టి అప్పారావు, తన భార్య ప్రమీల దేవి (60)తో కలిసి ద్విచక్ర వాహనంపై మండలంలోని నెక్కలం గొల్లగూడెం అడ్డ రోడ్డులోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తుండగా అడవినెక్కలం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రమీల దేవి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. భర్త అప్పారావు ఫిర్యాదు మేరకు ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు (మెట్రో): జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం శనివారం ఏలూరులోని ఐఏడీపీ హాలు నందు ప్రారంభించి నిర్వహించినట్లు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి. వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అనుసరించడం ద్వారా పంటల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. రైతులకు బయోకంట్రోల్ పద్ధతులు, జీవామృతం, ఘనజీవామృతం, కీటకనాశక తయారీ విధానాలు వంటి అంశాలపై వివరించామన్నారు. శిక్షణలో ప్రకృతి వ్యవసాయశాఖ అధికారులు, ఎఫ్‌ఎంటీ మాస్టర్ ట్రైనర్స్, సహాయక సిబ్బంది పాల్గొన్నారు.
భీమవరం: టెట్ నోటిఫికేషన్‌లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను పూర్తిగా మినహాయించాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి రమణ, ఉపాధ్యక్షుడు హరికృష్ణ, అసోసియేట్ అధ్యక్షురాలు శ్రీవల్లి శనివారం ఒక ప్రకటనలో కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వగానే ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం మినహా సుప్రీంకోర్టు ఉత్తర్వులలో ఏమున్నాయి, ఎవరికి వర్తిస్తాయి, కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏమిటనేది సమీక్షించకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలుపర్చాలని చూడడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ, తమిళనాడు, కేరళ ప్రభుత్వాల మాదిరిగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. 20 నుంచి 30 ఏళ్లు పైబడి సర్వీస్ పూర్తి చేసిన అనేకమంది ఉపాధ్యాయులు ఈ వయస్సులో టెట్ ఉత్తీర్ణత విషయంలో ఒత్తిడి గురవుతున్నారని, పదోన్నతులకు కూడా టెట్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.


