
జీఎస్టీ తగ్గినా.. దిగిరాని ధరలు
ఏలూరు (మెట్రో): జీఎస్టీ తగ్గించాం.. ధరలు తగ్గాయి కదా అని మార్కెట్‌కు వెళ్తే.. పాత ధరలకే విక్రయాలు చేస్తున్నారు. తాము కొనుగోలు చేసిన ధరలకే స్టాకు ఉన్నంత వరకూ పాత ధరకే విక్రయాలు సాగిస్తామని దుకాణదారులు చెబుతున్నారు. అధికారులు మాత్రం గొప్పలు చెప్పుకుంటూ ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. నూతన టారిఫ్‌ల ప్రకారం 12 శాతం జీఎస్టీ ఉన్న వస్తువులు 5 శాతంలోకి వెళ్లాయి. ఈ సెక్టార్‌లో వ్యత్యాసం 7 శాతంగా ఉంది. దీన్ని బట్టి రూ.1000 వస్తువు కొనుగోలు చేస్తే రూ.70 తగ్గాలి. వాస్తవానికి ప్రస్తుత మార్కెట్‌లో ఇది ఎక్కడా కనిపించడం లేదు. మందుల ధరల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అరుదైన వ్యాధుల మందులపై ధరలు తగ్గించారు. సుగర్, బీసీ ట్యాబ్లెట్ల ధరలు తగ్గించినా షాపుల్లో మాత్రం పాత ధరలకే అమ్ముతున్నారు. సామాన్యుడు ఉపయోగించే బియ్యం, గ్యాస్, పప్పు, నూనెల ధరలు అలాగే ఉండడమే కాకుండా పెరిగాయి. జీఎస్టీ తగ్గింపుతో పేదవాడికి ఎంతో మేలు చేకూరుతోందంటూ బస్టాండ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కార్యాలయాలతో పాటు అన్ని చోట్ల ఊదరగొడుతున్నారు. సెప్టెంబరు 25 నుంచి జీఎస్టీ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. వీటిని ఈనెల 19 వరకూ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తగ్గిన ధరలకు విక్రయాలు చేయాలంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు తప్ప ఏ ఒక్కరిపైనా పాత ధరలకు విక్రయిస్తున్నారని ఒక్క కేసును సైతం నమోదు చేసిన పాపాన పోలేదు. ఈ నెల 13 నుంచి హేలాపురి ఉత్సవాల పేరుతో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.