
బాణసంచా.. తస్మాత్ జాగ్రత్త!
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
భీమవరం: దీపావళి అంటే పిల్లలు, పెద్దలు అందరికీ పండుగే. పండుగకు 15 రోజుల ముందునుంచే బాణసంచా తయారీ, కొనుగోలుపై దృష్టిపెడతారు. గత కొన్నేళ్లుగా వివిధ రకాల కంపెనీల బాణసంచా మార్కెట్‌లోనికి రావడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో బాణసంచా విక్రయ కేంద్రాలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట తదితర ప్రాంతాల్లో తాత్కాలికంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటుచేసుకోడానికి 200కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. భీమవరం పట్టణంలో బాణసంచా దుకాణాలు ఏర్పాటుకు 25 మంది దరఖాస్తు చేసుకోగా లూథరన్ హైస్కూల్ ఆవరణలో ఇప్పటికే కొన్ని దుకాణాలు వెలిశాయి. జనావాసాలకు దూరంగా దుకాణాలు పెద్ద సంఖ్యలో ఒకే చోట ఏర్పాటు చేస్తున్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దుకాణాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● బాణసంచా దుకాణాల వద్ద మండే స్వభావం కల్గిన వస్తువులను ఉంచరాదు.
● ఒక్కొక్క దుకాణం మధ్య కనీసం మూడు మీటర్ల దూరం తప్పనిసరి.
● నూనె, గ్యాస్ దీపాలు వంటివి దుకాణాల్లో పెట్టకూడదు.
● బాణసంచా దుకాణాల వద్ద బాణసంచాను పరీక్షించేందుకు దుకాణ యజమానులు అంగీకరించకూడదు.
● విక్రయదారులు తక్కువ ప్రేలుడు స్వభావాన్ని కలిగిన బాణసంచా మాత్రమే అమ్మకాలు చేయాలి తప్ప స్థానికంగా తయారుచేసిన తారా జువ్వలు, చిచ్చు బుడ్లు, తాటాకు టపాకాయలు, నార బాంబులు వంటివి అనగా ఎక్కువ ప్రేలుడు స్వభావాన్ని కలిగిన గన్ పౌడర్, నైట్రేట్, క్లోరేట్, అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసిన మందుగుండును విక్రయించరాదు.
● ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవిస్తే అగ్ని మాపకవాహనం రావడానికి వీలుగా బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలి. దుకాణాల వద్ద 9 లీటర్ల సామర్థ్యం కల్గిన నాలుగు ఫైర్‌బకెట్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. రెండిటినీ పొడి ఇసుకతో, మరో రెండింటినీ నీటితోనూ నింపాలి.
● బాణాసంచా దుకాణాల వద్ద పొగ తాగడాన్ని పూర్తిగా నిషేధించాలి.
● దుకాణాల వద్ద స్థానిక ఫైర్ స్టేషన్ టోల్ ఫ్రీ నెంబర్ 101, పోలీసు డిపార్ట్‌మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ 100 ప్రదర్శన బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి.
బాణసంచా విక్రయ దుకాణాల వద్ద తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. దుకాణదారులకు బాణసంచా తయారీకి అనుమతులు లేవు. ఇతరప్రాంతాల నుంచి తీసుకువచ్చి విక్రయించే బాణసంచాను 18 ఏళ్లలోపు పిల్లలకు విక్రయించకుండా తగిన జాగ్రత్తలతో వ్యాపారం చేసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– కె శ్రీనివాసరావు, ఏడీఎఫ్‌వో, భీమవరం

బాణసంచా.. తస్మాత్ జాగ్రత్త!