
పత్తి కేంద్రాలు తెరవాలి
జంగారెడ్డిగూడెం: ఖరీఫ్ సీజన్‌లోని పత్తి కొనుగోలుకు సీసీఐ కేంద్రాలు తెరవాలని, పత్తి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో శనివారం జరిగిన రైతు సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నిర్ణయించిన క్వింటాల్‌కు రూ.8,110 మద్దతు ధర రైతులకు దక్కే పరిస్థితి లేదన్నారు. పత్తి వ్యాపారులు రకరకాల పద్ధతుల్లో క్వింటాలుకు రూ.ఆరేడు వేలకు మించి ధర ఇవ్వకుండా రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. తక్షణమే సీసీఐ కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని, క్వింటాల్‌కు రూ.10,500 మద్దతు ధర ప్రకటించాలని కోరారు.
నూజివీడు: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పది మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయటాన్ని అందరూ వ్యతిరేకరించాలని సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.హరినాథ్ శనివారం ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక కారణాల సాకుగా విద్య, వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించటం బాధ్యతా రాహిత్యమేనన్నారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అప్పగించడం ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లుపోడవటమేనని, సామాన్య ప్రజలకు వైద్యాన్ని దూరం చేయడమేనని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్యం కొనసాగాలని చంద్రబాబు ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు న్యాయపరంగా కూడా అడ్డుకుంటామని పేర్కొన్నారు.