
పేలుతున్న టపాసుల ధరలు
● ధరలకు రెక్కలు
● 20 నుంచి 40 శాతం మేర పెరుగుదల
● వెనుకాడుతున్న వినియోగదారులు
● కళతప్పిన బాణసంచా దుకాణాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బాణసంచా టపాసుల ధరలు మోత మోగిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే 20 నుంచి 40 శాతం వరకూ ధరల పెరుగుదలతో ప్రజలు కొనేందుకు వెనుకాడుతున్నారు. దీంతో దుకాణాలు కళతప్పాయి. ఏటా ధరలు పెరగడం సహజమే అయినా ఈ ఏడాది పెరుగుదల భారీస్థాయిలో ఉంది. గతేడాది కాకర పువ్వొత్తుల ధర 5 ప్యాకెట్లు రూ.70 ఉండగా ప్రస్తుతం రూ.100కు పెరిగింది. చిచ్చుబుడ్ల ధరలు చిన్నవి (10 ప్యాకెట్) రూ.100 నుంచి రూ.150కు పెరిగాయి. అలాగే భూచక్రాలు, తాళ్లు, వెన్నముద్దలు, పాము బిళ్లల వంటి రకాల ధరలూ పెరిగాయి. సీమటపాకాయలు, 5 థౌజండ్ వాలాలు, 10 థౌజండ్ వాలాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. 5 థౌజండ్ వాలా గతేడాది సాధారణ కంపెనీ రూ.1,000 ఉంటే ప్రస్తుతం రూ.1,500కు పెరిగింది.
కొనుగోలు సంకోచిస్తూ..
ధరల పెరుగుదలతో రూ.2 వేలు వెచ్చించినా సంచి బాణసంచా సామగ్రి కూడా రాకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలుకు సంకోచిస్తున్నాయి. ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపుతుందని వ్యాపారులు అంటున్నారు.
కళతప్పిన దుకాణాలు
ప్రజల్లో బాణసంచా కొనుగోలుకు నిరాసక్తత, ఆర్థిక భారం వంటి కారణాలతో ఈ ఏడాది బాణసంచా దుకాణాలు కళతప్పాయి. దీపావళి పండగకు కనీసం వారం రోజుల ముందు నుంచి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో వట్లూరులో నిర్వహించే బాణసంచా దుకాణం కళకళలాడుతూ ఉండేది. ఈ దుకాణంలో కేవలం స్టాండర్డ్ కంపెనీ బాణసంచా మాత్రమే విక్రయించడం, అది కూడా బేరాలు లేకుండానే దాదాపు 75 శాతం తగ్గింపు ధరలకే విక్రయించడంతో నగర ప్రజల నుంచి విశేష ఆదరణ లభించేది. అలాగే ఏలూరు ఇండోర్ స్టేడియంలో బాణసంచా దుకాణాలను నాలుగు రో జుల ముందే ఏర్పాటుచేసేవారు. అయితే ఈ ఏడాది శనివారం నుంచి దుకాణాలు ప్రారంభించడం, ఎక్కడా సందడి లేకపోవడం గమనార్హం.
పథకాల లేమీ కారణమే..
బాణసంచా విషయంలో నిరాసక్తతకు పథకాల లేమి కూడా కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పథకాల రూపంలో నేరుగా లబ్ధిని ప్రజల ఖాతాల్లో జమచేయడంతో నిత్యం డబ్బులు ఉండేవని, దీంతో రొటేషన్ జరిగేదని చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం కొన్ని పథకాలను అదీ నామమాత్రంగా అమలు చేయడం, మరికొన్ని పథకాలను అమలుచేయకపోవడంతో ప్రజల వద్ద డబ్బులు ఉండటం లేదని, దీంతో బాణసంచా దుకాణాలు కళతప్పాయని అంటున్నారు.