
ప్రైవేటీకరణతో కార్మికులకు అన్యాయం
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ కార్మికులు చేయాల్సిన పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించడాన్ని నిలిపివేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి అంగుళూరు జాన్‌బాబు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతంలో కాంట్రాక్టర్ల ద్వారా మున్సిపల్ పనులు జరిగిన కాలంలో కార్మికులకు కష్టానికి తగిన వేతనాలు లేవని, పీఎఫ్ ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలను సైతం పొందలేకపోయేవారమని ఆవేదన వ్యక్తం చేశారు. మరలా ఇదే విధానాన్ని ఏలూరులో ప్రవేశపెట్టడం అంటే కార్మికుల కడుపుకొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపడమే అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం జీఓ తీసుకురాగా సీఐటీయూ ప్రతిఘటనతో నిలిపివేశారని.. మరలా అదే పద్ధతిని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని కార్మికులంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు ఆర్.లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్ మాట్లాడారు. ధర్నాకు జె.గోపి, ఎం.ఇస్సాకు, వైఎస్ కనకారావు, పి.రవికుమార్, ధనాల వెంకటరావు, బండి రాజు సామ్రాజ్యం, గంగాధర్‌రావు నాయకత్వం వహించారు.