
రోడ్డు మీద రోడ్డు వేసేయ్!
నూజివీడు మున్సిపాలిటీలో ప్రజాధనం వృథా
నూజివీడు: ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూపాయి వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై, అధికారులపై ఉంది. నూజివీడు మున్సిపాలిటీలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా చేసేస్తున్నారు. పట్టణంలోని శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేయాల్సిన మట్టిరోడ్లు ఎన్నో ఉన్నప్పటికీ వాటినన్నింటిని వదిలేసి బాగున్న రోడ్డుపైనే మళ్లీ సిమెంట్ రోడ్డు వేసేందుకు మున్సిపాలిటీ ఇంజినీరింగ్ విభాగం సన్నద్ధమైంది. దీంతో బాగున్న రోడ్డుపై రోడ్డు వేయడం నూజివీడు మున్సిపాలిటీలోనే సాధ్యమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగా ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు పిలిచి పని చేసేందుకు కాంట్రాక్టర్‌ను సైతం నిర్ణయించగా దానికి మున్సిపల్ కౌన్సిల్ తందాన అంటూ ఆమోదం తెలపడం గమనార్హం. దీంతో రూ.7.35 లక్షల ప్రజాధనం వృధా కానుంది. పట్టణంలోని పాత మీసేవా కేంద్రం వద్ద నుంచి సీపీఎం కార్యాలయం వరకు సీసీ రోడ్డు నిర్మించడానికి మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు రూ.7.75 లక్షల అంచనా విలువతో టెండర్లు పిలిచారు. దీనికి 5.24 శాతం లెస్‌తో టెండర్ వేసిన కాంట్రాక్టర్‌కు వర్కు దక్కింది.
పాత మీసేవా కేంద్రం వద్ద నుంచి సీపీఎం ఆఫీసు మీదుగా రైతుబజారు రోడ్డు వరకు అల్రెడీ సిమెంట్ రోడ్డు ఉంది. ఈ రోడ్డు బాగానే ఉన్నప్పటికీ దీనిపై మళ్లీ రోడ్డు వేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఈ రోడ్డు భారీ వాహనాలు రాకపోకలు సాగించడానికి కుదరదు. రోడ్డు బాగున్నప్పటికీ సిమెంట్ రోడ్డు వేయడానికి సిద్ధం చేయడం దారుణం. శివారు ప్రాంతాలైన ఉషాబాలానగర్, నందనం తోట, ఎమ్మార్ అప్పారావు కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, రోటరీ ఆడిటోరియం ప్రాంతాల్లో పదుల సంఖ్యలో మట్టిరోడ్లు ఉన్నాయి. అధిక మొత్తంలో మున్సిపాలిటీకి ఆస్తిపన్ను వచ్చే రోటరీ ఆడిటోరియం ఏరియాలో రోడ్ల అభివృద్ధి చేయాల్సి ఉంది. వాటిని వదిలేసి ఏరియా కౌన్సిలర్ చెప్పారంటూ రోడ్డుపై రోడ్డు వేయడానికి ప్రజాధనాన్ని వృథా చేస్తుండటం గమనార్హం.