
ఏజెన్సీలో ఆగని మట్టి రవాణా
మట్టి దోపిడీని అరికట్టాలి
● రాత్రి, పగలు తేడాలేకుండా తోలకాలు
● పట్టించుకోని అధికారులు
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని సర్వత్రా విమర్శిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం ఎన్‌ఆర్‌పాలెం సమీపంలో ఇటీవల ఒక గిరిజనుడికి చెందిన పట్టా భూమిలో ఉన్న కొండను కూటమి నాయకులు నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్లు పెట్టి లారీలతో మట్టి రవాణా చేస్తూ సొమ్ములు దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కొండను తవ్వి చదును చేసేందుకు పీసా కమిటీ తీర్మానం చేసుకున్నామని గిరిజనులు చెబుతున్నప్పటికీ అది ఆ గ్రామ పరిధిలో తప్ప లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం లేదని పలువురు వాపోతున్నారు. ఇక్కడ తవ్విన మట్టిని బుట్టాయగూడెం పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ కూటమి నాయకులు సొమ్మును కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు.
నూతిరామన్నపాలెంలో అక్రమంగా మట్టిని తరలిస్తూ కూటమి నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. అది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు ఉండడం బాధాకరం. ఇప్పటికై నా అక్రమ మట్టి రవాణాపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలి.
– తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, దుద్దుకూరు, బుట్టాయగూడెం మండలం

ఏజెన్సీలో ఆగని మట్టి రవాణా