
విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు!
● గణితం, ఇంగ్లీషు బోధించడానికి ఈసీఈ ఫ్యాకల్టీ!
● ట్రిపుల్ ఐటీలో పీయూసీ బోధన తీరుపై విమర్శలు
నూజివీడు: ఇంటి పెద్ద ఇల్లును పట్టించుకోకపోతే ఇల్లు ఎలా గాడి తప్పి పతనమవుతుందో... ఇలాంటి పరిస్థితే ట్రిపుల్ ఐటీలో నెలకొంటోంది. ట్రిపుల్ ఐటీ అంటే ఎంతో ఉన్నత స్థాయి విద్యాసంస్థ అని ప్రజలు భావిస్తుండగా, యాజమాన్యం మాత్రం నవ్వులపాలయ్యే నిర్ణయాలు తీసుకుంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న 10 మంది ఫ్యాకల్టీకి ఉద్యోగాలు రావడంతో వారు ఇక్కడ ఉద్యోగాలకు రిజైన్ చేసి వెళ్లిపోయారు. దీనిలో భాగంగానే నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న శ్రీకాకుళం పీయూసీలో గణితం, ఇంగ్లీషు బోధిస్తున్న రాజేష్, రమాదేవి అనే ఫ్యాకల్టీకి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు రావడంతో వారు రిజైన్ చేసి వెళ్లిపోయారు. దీంతో గణితం, ఇంగ్లీషు బోధించేందుకు ఫ్యాకల్టీ అవసరమైంది. ఈ పరిస్థితుల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధించే ఈసీఈ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను పీయూసీలో గణితం, ఇంగ్లీషు సబ్జెక్టులను బోధించేందుకు నియమిస్తూ శ్రీకాకుళం డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై ట్రిపుల్ ఐటీలోని ఫ్యాకల్టీ సిబ్బందిలోనే విస్మయం వ్యక్తమవుతోంది. ఇంజినీరింగ్‌లో ఈసీఈ విద్యార్థులకు బోధించాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్లను పీయూసీలో గణితం, ఇంగ్లీషు సబ్జెక్టులు బోధించడానికి ఎలా నియమిస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెస్సీ, ఎంఏ చదివిన వారు అర్హులు కదా..!
పీయూసీలో గణితం బోధించడానికి ఎమ్మెస్సీ గణితం చదివిన వారు, ఇంగ్లీషు బోధించడానికి ఎంఏ ఇంగ్లీషు చేసిన వారు అర్హులు కాగా, ఈసీఈ చదివిన వారు ఎలా చెబుతారో అంతుబట్టడం లేదు. ఎంతో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్ విద్యను అందించే ట్రిపుల్ ఐటీలాంటి సంస్థలో యాజమాన్యం సరైన నిర్ణయాలు తీసుకోకుండా విద్యార్థుల భవిష్యత్‌ను పణంగా పెట్టడం దారుణం. అర్హత ఉన్న వారు లేకపోతే నియమించుకోవాలే తప్ప ఇలా అనర్హులతో బోధన చేయిస్తే రేపు పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారో యాజమాన్యమే బదులివ్వాల్సిన అవసరం ఉంది.
పీయూసీ విద్యార్థులకు గణితం, ఇంగ్లీషు సబ్జెక్టులను బోధించడానికి ఈసీఈ ఫ్యాకల్టీని నియమించినప్పటికీ దానిని తిరస్కరించాం. క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతోనే బోధన చేయిస్తాం. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ నుంచి వచ్చిన ఆర్డర్‌ను కుదరదని తిప్పి పంపించాం.
– ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, ఆచార్య
సండ్ర అమరేంద్రకుమార్