పలు కేసుల్లో నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పలు కేసుల్లో నిందితుల అరెస్ట్‌

Sep 19 2025 2:03 AM | Updated on Sep 19 2025 2:03 AM

పలు కేసుల్లో నిందితుల అరెస్ట్‌

పలు కేసుల్లో నిందితుల అరెస్ట్‌

చోరీ సొత్తు రికవరీ చేసిన పోలీసులు

వివరాలు వెల్లడించిన ఎస్పీ ప్రతాప్‌ శివకిషోర్‌

ఏలూరు టౌన్‌: జిల్లా వ్యాప్తంగా పలు కేసులను పోలీసులు చేధించారు. నిందితులను అరెస్ట్‌ చేసి చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఈమేరకు గురువారం ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ వివరాలు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్‌ ఉన్నారు.

బంగారు ఆభరణాల కోసం దాడి

ఏలూరు శివారు వట్లూరు ప్రాంతంలో సింగంశెట్టి మల్లేశ్వరమ్మ కిరాణాషాపు నిర్వహిస్తోంది. ఆమె ముందువైపు ఇంటిలో పెనుగొండకు చెందిన సిద్దాని నాగదుర్గాభవానీ, నాగరాజు దంపతులు నివసిస్తున్నారు. మల్లేశ్వరమ్మ మెడలోని బంగారు నాన్‌తాడు, నల్లపూసల తాడును కాజేసేందుకు ఈ దంపతులు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన గంగులూరి రవితేజ, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ళకు చెందిన సింగులూరి సురేష్‌ అలియాస్‌ సన్నీతో పథకం రచించారు. ఈనెల 14న సాయంత్రం రవితేజ మల్లేశ్వరమ్మ ఇంట్లోకి వెళ్లి ఆమె మెడలోని బంగారు నాన్‌తాడు లాక్కునేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించి గట్టిగా కేకలు వేస్తూ ఉండడంతో చాకుతో ఆమైపె విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. దీనిపై ఏలూరు త్రీటౌన్‌ సీఐ వీ.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి మూడు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులు రవితేజ, నాగదుర్గాభవానీ, నాగరాజు, సురేష్‌ కారులో ఏలూరు మినీబైపాస్‌ వైపునుంచీ పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి కారు, రెండు పల్సర్‌ మోటారు సైకిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఓఎల్‌ఎక్స్‌లో చూసి బైక్‌ కొనేందుకు వచ్చి..

కలిదిండి గ్రామానికి చెందిన తలారి జాస్పర్‌ కిరణ్‌ తన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 350 మోటారు సైకిల్‌ను విక్రయించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టాడు. ఒక వ్యక్తి మోటారు సైకిల్‌ కొనుగోలు చేసేందుకు వచ్చి బైక్‌ ఎలా ఉందో చూస్తానని చెప్పి గురవాయిగూడెం గ్రామ శివారు, మద్వానిగూడెం ఊరు చివరకు తీసుకువెళ్లి కిరణ్‌ను కత్తితో బెదిరించి మోటారు సైకిల్‌తో పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు కై కలూరు రూరల్‌ సీఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో కలిదిండి ఎస్సై వీ.వెంకటేశ్వరరావు దర్యాప్తు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, కృష్ణానగర్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి రూ.5,40,000 విలువైన 6 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

మోటార్‌సైకిళ్ల దొంగ అరెస్ట్‌

తన మోటార్‌సైకిల్‌ దొంగింలించారని గణపవరంలో బొట్ట శివకుమార్‌ చేసిన ఫిర్యాదు మేరకు నిడమర్రు సీఐ ఎన్‌.రజనీకుమార్‌ ఆధ్వర్యంలో గణపవరం ఎస్సై ఏ.మణికుమార్‌ కేసును విచారణ చేపట్టారు. ఈకేసులో పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం కోలమూరు గ్రామానికి చెందిన జక్కుల ప్రభుకుమార్‌ను అరెస్ట్‌ చేయగా... అతనికి వరసకు తమ్ముడైన గణపవరం సంతమార్కెట్‌ ప్రాంతానికి చెందిన జక్కుల శివకుమార్‌ జువైనల్‌ కావటంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.3,55,000 విలువైన 5 మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆరు మోటార్‌సైకిళ్లు స్వాధీనం

ఏలూరు ఆటోనగర్‌లోని జనతా గ్యారేజ్‌ మెకానిక్‌షాపులో పల్సర్‌ మోటారు సైకిల్‌ అపహరణకు గురికావటంతో బాధితుడు కొండల రమేష్‌ ఏలూరు రూరల్‌ పోలీసులకు ఆగస్ట్‌ 26న ఫిర్యాదు చేశాడు. ఏలూరు వన్‌టౌన్‌ ఇన్‌చార్జి సీఐ ఎం.సుబ్బారావు ఆధ్వర్యంలో ఏలూరు రూరల్‌ ఇన్‌చార్జి ఎస్సై బీ.నాగబాబు విచారణ చేపట్టారు. ఈనెల 17న పోలీసులు ఆశ్రం సర్కిల్‌లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా భీమడోలుకు చెందిన మండపతి జీవన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 6 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులను ఛేదించిన పోలీసు లను, సిబ్బందిని ఎస్పీ శివకిషోర్‌ ప్రత్యేకంగా అభినందించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement