
యూరియాపై అదనపు వసూళ్లు
ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారు
● బస్తాకు రూ.130 వరకు అదనపు వసూలు
● కుక్కునూరు మండలంలోఓ ఎరువుల వ్యాపారిపై ఆరోపణలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: యూరియా కొరతను ఆసరాగా చేసుకుని బస్తాపై అధికంగా వసూలు చేస్తున్న సంఘటన కుక్కునూరు మండలంలోని గణపవరం గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఓ ఎరువుల వ్యాపారి గ్రామంలో కొందరు రైతుల నుంచి యూరియా బస్తాకు రూ.500 వసూలు చేశాడు. అలాగే యూరియా విక్రయించినప్పుడు రైతులతో థంబ్ కూడా వేయించుకోలేదు. వాస్తవంగా బస్తా ధర రూ.370 కాగా రూ.130 అదనంగా వసూలు చేసినట్టు పలువురు రైతులు చెబుతున్నారు.
అధికార పార్టీ వారికే..
యూరియా అమ్మకంలో కూడా సదరు వ్యాపారి వివక్ష చూపించినట్టు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన రైతులకు మాత్రమే యూరియా విక్రయించాడని, అలాగే వారికి ఒక్కొక్కరికీ 15 బస్తాల వరకు ఇ చ్చాడని అంటున్నారు. వరి సాగుచేస్తున్న వైఎస్సార్‌సీపీకి చెందిన రైతులకు యూరియా ఇవ్వకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరిదిద్దుకునే ప్రయత్నం
యూరియా అమ్మకంలో అదనంగా వసూలు చేసిన విషయం అధికారు లకు తెలియడంతో సదరు వ్యాపారి సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. గురువారం రైతుల వద్దకు వెళ్లి థంబ్ వేయించుకున్నట్టు తెలిసింది. అలాగే బస్తాకు అదనంగా తీసుకున్న రూ.130లను గ్రామంలో ఓ వ్యక్తి వద్దకు పంపిస్తానని చెప్పినట్టు సమాచారం. ఆరుగాలం శ్రమించే రైతులను దోచుకోవడం తగదని, అలాగే పార్టీ పేరుతో వివక్ష చూపడం దారుణమని స్థానికులు వాపోతున్నారు.
నేను ఎంతగానో బతిమిలాడితే ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారు. అది కూడా రూ.500 వసూలు చేశారు. అదనపు వసూళ్లపై ప్రశ్నిస్తే యూరియా ఇవ్వడం లేదని తెలిసి నేను వ్యాపారి అడిగినంత చెల్లించాను. అలాగే మా గ్రామంలో అసలు వ్యవసాయం చేయని వారికి కూడా యూరియా బస్తాలు అమ్మారు. అధికార పార్టీకి చెందని చాలా మందికి యూరియా బస్తాలు ఇవ్వలేదు.
– కొత్తపల్లి రాంబాబు,
రైతు, గణపవరం, కుక్కునూరు మండలం