
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు కూటమి కుట్ర
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్‌సీపీ ‘చలో మెడికల్ కాలేజ్’ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్ తెలిపారు. ఏలూరు లోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏనాడైనా రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను అయినా ఏర్పాటు చేశారా? అని ప్రశ్నింంచారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో కేంద్రం నుంచి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చారని, నేడు వాటిని ప్రైవేటుపరం చేసే హక్కు కూటమి నేతలకు లేదన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏలూరు పాతబస్టాండ్ సమీపంలోని ప్రభు త్వ మెడికల్ కాలేజీ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టనున్నామని పార్టీ యువజన, విద్యార్థి విభాగం నేత లు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే, కూటమి నేతలు ఏర్పాటు చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని డీఎన్నార్ స్పష్టం చేశారు.
మాజీ సీఎం జగన్‌తోనే సాకారం
పార్టీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ జిల్లాకే తలమానికంగా ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుచేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఏలూరు జీజీహెచ్‌లో 2019 అక్టోబర్ 4న కాలేజీ నిర్మాణానికి మాజీ సీఎం జగన్ శంకుస్థాపన చేసిన విషయం ప్రజలకు తెలుసన్నారు.
ప్రైవేటీకరణపై ఆగ్రహం
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు, ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అసలైన విజనరీ లీడర్ అన్నారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తిచేస్తే భవిష్యత్‌లో వాటి విలువ సుమారు రూ.లక్ష కో ట్లకు పైగా ఉంటుందని, సంపద సృష్టించటం అంటే ఇలా ఉండాలని అన్నారు. కూటమి ప్రభుత్వం వందల కోట్ల విలువైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయటంపై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పాతినవలస రాజేష్, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షుడు భోగిశెట్టి పార్వతి, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు సముద్రాల దుర్గారావు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింహాద్రి మోహన్‌చందు, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటా మోహనరావు, మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్ జాబ్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు బాలాజీ, యువజన విభాగం నగర అధ్యక్షుడు ఘంటా సాయి ప్రదీప్, ఐటీ వింగ్ నగర అధ్యక్షుడు పిల్లంగోళ్ల సత్యదేవ్ ఉన్నారు.
నేడు వైఎస్సార్‌సీపీ ‘చలో మెడికల్ కాలేజ్’
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద నిరసన
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్, యువజన జోనల్ అధ్యక్షుడు సునీల్