
బాలుడి ఆచూకీ గుర్తించిన పోలీసులు
ఏలూరు టౌన్: రక్తపు మడుగులో గుర్తు తెలియని బాలుడు ఏలూరు శివారు ఎస్‌వీ రంగారావు విగ్రహం ఎదురుగా నిర్మానుష్య ప్రాంతంలోని పొలాల్లో బుధవారం రాత్రి పడి ఉండడం కలకలకం రేపింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడ్ని ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా... న్యూరో సర్జన్ అందుబాటులో లేకపోవటంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలుడి ఆచూకీపై పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్, పెదపాడు ఎస్సై లుకవుట్ నోటీసులు జారీచేసి రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించారు.
గంటల వ్యవధిలో గుర్తింపు
గురువారం తెల్లవారుజామున బాలుడి అచూకీ కనిపెట్టారు. విజయవాడ రామవరప్పాడు గణేష్ నగర్ ప్రాంతానికి చెందిన తురగా విజయ్‌కుమార్ (14)గా గుర్తించారు. ఈనెల 16న ఉదయం బాలుడు విజయ్‌కుమార్ ఇంటినుంచి బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తల్లి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ కుమారుడ్ని పోషించుకుంటుందని, బాలుడి అదృశ్యంపై తల్లి పడమట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బాలుడు పడి ఉన్న ఘటనా స్థలంలో ఆధారాల కోసం డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు రంగంలోకి దిగాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీస్ అధికారులు సీసీ కెమేరాలు పరిశీలించడంతోపాటు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కేసు నమోదు చేసిన విజయవాడ పడమట పోలీసులు సైతం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారనీ తెలిసింది. హత్యాయత్నానికి కారణాలు ఏమిటనే కోణంలో క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారు.
విజయవాడ రామవరప్పాడు ప్రాంతంవాసిగా గుర్తింపు