
అమ్మపాలు బిడ్డకు అమృతం
కై కలూరు: వ్యాధులకు కారణం పోతపాలు.. బిడ్డ సరైన ఎదుగుదలకు కావాలి తల్లిపాలు అంటూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు శుక్రవారం నుంచి జిల్లాలో ప్రారంభమయ్యాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం(ఐసీడీఎస్) పర్యవేక్షణలో ఏలూరు జిల్లాలో 2,226 అంగన్‌వాడీ కేంద్రాల్లో 7వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గర్భిణులు, శిశుతల్లులు, యువతులకు క్విజ్ పోటీలు, బొమ్మలు, పోస్టర్లు, బ్యానర్లతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. పుట్టిన గంటలోపే ముర్రిపాలు పట్టించడంపై నెలకొన్న తల్లుల అపోహలను తొలగించే దిశగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.
తల్లి పాలకు ప్రాధాన్యత ఇవ్వండి
ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా శ్రీతల్లిపాలకు ప్రాధాన్యత నివ్వండి, స్థిరమైన మద్దతు వ్యవస్థలను సృష్టించండిశ్రీ అనే నినాదంతో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రసుత్తం 120 దేశాల్లో తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లాలో 6 నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సు పిల్లలు 48,563, మూడేళ్ల వయస్సు నుంచి ఆరేళ్ల వరకు 23,499 పిల్లలు ఉన్నారు. ఇక జిల్లాలో గర్భవతులు 8,861, బాలింతలు 6,592, కౌమారదశ బాలికలు 21,498 మంది ఉన్నారు.
తల్లిపాల వల్ల బిడ్డ పొందే లాభాలు
● తల్లి పాలలో శిశువు పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు ఖనిజాలు సమతుల్యతలో ఉంటాయి.
● తల్లిపాలు తాగే బిడ్డలో 8 ఐ.క్యూ పాయింట్లు తల్లిపాలు తాగని బిడ్డ కంటే ఎక్కువ ఉంటాయి.
● మెదడు అభివృద్ధి చెందడంతో పాటు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
● బాల్య ఊబకాయం, టైప్– 2 డయాబెటిస్, ఉబ్బసం, కొన్ని రకాల బాల్య ల్యుకేమియా వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
● తల్లిపాలు సులభంగా జీర్ణమవుతాయి. బిడ్డకు మలబద్దకం, కడుపునొప్పి రాదు.
● బిడ్డకు కావలసిన ఇనుము, కాల్షియం అందడంతో రక్తహీనత రాదు.
● బిడ్డ చూపు, వాసన, వినికిడి, రుచి, స్వర్శ వంటి జ్ఞానేంద్రియాలు అభివృద్ధి.
తల్లికి కలిగే ప్రయోజనాలు
● తల్లి పాలివ్వడం వల్ల తల్లికి రొమ్ము, ఓవరీస్ కాన్సర్‌లు, ఆస్టియో పోరోసిస్(ఎముకలు పటుత్వం కోల్పోవడం) జబ్బులు రావు.
● తల్లి, బిడ్డ మధ్య బలమైన భావోద్వేగ సంబంధాన్ని ప్రోత్సహిస్తుంది.
● అధిక రక్తపోటు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ తగ్గించవచ్చు.
● డయాబెటిక్ తల్లులు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల ఇన్సూలిన్ తీసుకునే అవసరం తగ్గుతుంది.
● తల్లిపాలు ఇవ్వడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది గర్భాశయం సాధారణ పరిమాణానికి తిరిగి రావడానికి సహాయపడుతుంది.
● ప్రసవానంతర రక్తస్రావాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
● తల్లులు గర్భధారణ బరువును క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది.
ప్రసవించిన గంటలోపే ముర్రిపాలు పట్టాలి
బిడ్డ పుట్టిన మూడు రోజుల్లో వచ్చే పాలను ముర్రిపాలు అంటారు. ప్రసవించిన గంట లోపే బిడ్డకు ముర్రిపాలు పట్టడం వల్ల శిశు మరణాలు తగ్గించవచ్చు. ముర్రిపాలలో విటమిన్ ఏ, సీ, డీ, ఇ, కే, ప్రొటీన్స్, మినరల్స్, క్రొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ముర్రిపాలు శిశువు ప్రేగులను శుభ్రం చేసే ప్రభావం కలిగి ఉంటాయి. ప్రేగుల్లోని బెలిరూబిన్ విసర్జింపచేయడం ద్వారా బిడ్డకు కామెర్లు తీవ్రతను తగ్గిస్తోంది. బంగారం వంటి ముర్రిపాలను ఇప్పటికీ కొందరు మహిళలు మూఢ నమ్మకాలతో బిడ్డలకు పట్టడం లేదు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ముర్రిపాల ఆవశ్యకతను చాటిచెబుతున్నారు.
ఈ నెల 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
జిల్లాలో 6,592 మంది బాలింతలకు అవగాహన
బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం
మొదటి 6 నెలలు తల్లి పాలే బిడ్డకు సంపూర్ణ పోషకాహారం. తల్లిపాలలో మాంసకృత్తులు, కొవ్వు, విటమిన్లు, కాల్షియం, ఇనుము ఇతర ఖనిజాలు పుష్పలంగా లభిస్తాయి. తల్లిపాల వారోత్సవాలను జిల్లాలో అన్ని కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం. బాలింతలు, గర్భిణులు, కౌమారదశ యువతలకు అవగాహన కలిగిస్తున్నాం. తల్లి పాల ప్రయోజనాలను తల్లులు తెలుసుకోవాలి.
– పి.శారద, ఐసీడీఎస్. జిల్లా పీడీ, ఏలూరు.
వ్యాధుల నుంచి రక్షణ
శిశువు జీవితంలో మొదటి తల్లిపాలే ప్రాథమిక వనరుగా ఉంటాయి. తల్లిపాలలో 87 శాతం నీరు, 7 శాతం కార్బోహైడ్రేట్, 4 శాతం లిపిడ్, 1 శాతం ప్రోటిన్, విటమిన్లు ఇతర ఖనిజాలు ఉంటాయి. తల్లి పాలు తీసుకున్నవారికి స్వల్ప, దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల తల్లులూ ఆరోగ్యంగా ఉంటారు.
– డాక్టర్ కె.అన్నపూర్ణ, శీతనపల్లి పీహెచ్‌సీ

అమ్మపాలు బిడ్డకు అమృతం

అమ్మపాలు బిడ్డకు అమృతం

అమ్మపాలు బిడ్డకు అమృతం