
శ్రీవారి సేవలో..
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని శనివారం స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ జోన్–2 రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ బీఆర్ క్రాంతి కుమారి సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆమెకు ముందుగా దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనం అందజేసి సత్కరించారు.
సెప్టెంబరు 13న జాతీయ లోక్ అదాలత్
ఏలూరు (టూటౌన్): సెప్టెంబర్ 13వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ కోరారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసధన్ భవన్ నందు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులతో పాటు సివిల్, వాహనం ప్రమాద బీమా, బ్యాంకు లావాదేవీలు, కుటుంబ వివాదాలు, టెలిఫోన్ బకాయిలు, చిట్ ఫండ్ కేసులు, అమలు పిటీషన్లు (ఇ.పి) రాజీ చేయడం జరుగుతుందన్నారు. కేసుల పరిష్కారంలోగానీ, మరి ఏ ఇతర సమస్యలు ఎదురైన 15100 లేదా 08812 224555ను సంప్రదించాలన్నారు.