
విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలి
ఏలూరు (టూటౌన్): విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలని, ఈనెల 5వ తేదీన విద్యుత్ భవనం వద్ద చేపట్టే ప్రజాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో శనివారం టూటౌన్ తంగేళ్లమూడి సెంటర్, గన్‌బజార్‌లలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచము అని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చి, ఇప్పుడు ప్రజలపై ఆర్థిక భారము మోపేలా స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమాన్ని చేపట్టడం దారుణమన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు ఉపాధి లేక,, ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇప్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సహాయ కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగ ప్రభాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, చేతివృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ పిచ్చుకల ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.
పొగాకు బేళ్లు చోరీ నిందితుల అరెస్ట్
టి.నరసాపురం: పొగాకు బేళ్లు చోరీ నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై జయబాబు తెలిపారు. వివరాల ప్రకారం.. మండంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన భూక్యా భాస్కరరావుకు చెందిన 14 పొగాకు బేళ్లు చోరీపై జూలై 28న ఫిర్యాదు చేశాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు శనివారం నలుగురిని నిందితులుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసి అనంతరం రిమాండ్‌కు పంపారు. నిందితులతోపాటు పొగాకు బేళ్లు కలిగిన వాహనాన్ని సీజ్ చేశామన్నారు.