
యోగాసనం.. ఆరోగ్య రహస్యం
కై కలూరు/పాలకొల్లు సెంట్రల్: శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. భారతదేశంలో వేల ఏళ్ల నుంచి యోగాకు ప్రాచుర్యం ఉంది. 2014 డిసెంబరు 11న జరిగిన ఐక్యరాజ్య సమితి 69వ జనరల్ అసెంబ్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా తీర్మానించారు. ఏటా జూన్ 21 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది శ్రీయోగా ఒక భూమి, ఒక ఆరోగ్యంశ్రీ అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
యోగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఇది మనసును నియంత్రించడంతో పాటు మెదడును ఉత్తేజ పరుస్తోంది. పూర్వకాలంలో చరక, సుశ్రుత, ధన్వంతరి, పతంజలి, కపిలుడు వంటి రుషుల నుంచి, ఆధునిక యుగంలో రమణ మహర్షి, అరవింద యోగి, రామకృష్ణ పరమహంస, శివానంద, యోగానంద, బాబా రామ్‌దేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వంటి ఎందరో యోగా విశిష్టతను చాటి చెప్పారు. ఈ ఏడాది ప్రత్యేకంగా 10 కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యోగా పేరుతో సంగం, బంధన్, పార్క్, సమావేశ్, ప్రభావ, కనెక్ట్, హరిత్, అన్‌ప్లగ్డ్, మహాకుంభ్, సంయోగ పేరుతో వీటిని రూపొందించారు. ప్రధానంగా మహాసంగం పేరుతో 1,00,000 ప్రాంతాల్లో యోగా ప్రదర్శనలు ఇస్తున్నారు.
అష్టాంగ మార్గం.. అనుసరణీయం
యోగాలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అని 8 అంశాలు ఉంటాయి. నేటి సమాజంలో సూర్య నమస్కార ఆసనాలు ప్రాధాన్యత పొందాయి. వీటిలో ప్రణమాసనం, హస్త ఉత్థానాసనం, పాద హస్తాసనం, ఆశ్వ సంచాలనాసనం, పర్వతాసనం, భుజంగాసనం, సాష్టాంగాసనం ముఖ్యమైనవి. ఇక స్థూలకాయ నివారణకు త్రికోణ, హలన శలభ, నిద్రలేమికి హలాసనం, శీర్షాసనం, శీతలి, ప్రాణాయామం, మలబద్దకానికి తాడ, చక్ర, మయూర, మత్య్సాసనాలు, నెలసరి ఇబ్బందులకు హల, గోముఖ, భద్ర, చంద్ర నమస్కారాలు వంటి ఉపయోగపడుతున్నాయి.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు
యోగాతో లాభాలు
ధ్యాన సాధన క్రమంగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది.
చదువు, ఉద్యోగ జీవితంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
దృష్టి ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ప్రశాంత కలుగుతోంది.
ఆందోళన, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.
ప్రాణాయామం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతోంది.
యోగాసనాలకు 45 నిమిషాల నుంచి గంటన్నర సమయం కేటాయించాలి.

యోగాసనం.. ఆరోగ్య రహస్యం