సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర
బుట్టాయగూడెం: మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. ప్రజలకు మంచి పాలనను చేరువ చేసే దిశగా ఇంటి వద్దకే సేవలందించేలా చర్యలు తీసుకున్నారు. గ్రామ, వార్డుల పరిధిలో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వ సేవల్లో ఎలాంటి కష్టం కలగకుండా విస్తృత సేవలందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే ్చ్ఛ కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గ్రామ సచివాలయాల కుదింపునకు రంగం సిద్ధం చేసింది. జనాభా ప్రాతిపదికన సచివాలయాలు ఉండేలా చర్యలు చేపట్టింది. క్లస్టరైజేషన్‌లో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 1,165 గ్రామ సచివాలయాలు సగానికి తగ్గించి 582కే పరిమితం చేయనున్నారు. సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బందిని గ్రేడ్‌ల వారీగా సర్దుబాటు చేయనున్నారు. ప్రభుత్వ చర్యలతో ఇటు ప్రజలు, అటు సచివాలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
దేశానికే ఆదర్శం సచివాలయ సేవలు
వైఎస్సార్‌సీపీ పాలనలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1,165 సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాల ద్వారా సుమారు 142 సేవలు గ్రామాల్లోని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకున్నారు. 938 గ్రామ సచివాలయాలు, 227 వార్డు సచివాలయాల్లో 8,468 మంది సచివాలయ సిబ్బందితో పాటుగా పంచాయతీ కార్యదర్శులను సైతం కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,165 గ్రామ సచివాలయాల్లో 9,099 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయల్లో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, సిబ్బంది, కార్యదర్శి అందుబాటులో ఉండేవారు. వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్లకు ప్రత్యేక కంప్యూటర్లను సైతం కేటాయించారు. కంప్యూటర్లకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేలా కృషి చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న క్లస్టర్ విధానంతో గ్రామ స్థాయిలో అందే సేవలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రెండు సచివాలయాలు కలిపి..
గ్రామ సచివాలయాలను క్లస్టర్‌గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి రెండు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేస్తారు. ఒక గ్రామంలో ఒకే సచివాలయం ఉంటే సమీప గ్రామంలోని సచివాలయాన్ని కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేస్తారు. పట్టణం, మండలం యూనిట్‌గా క్లస్టర్ల ఏర్పాటు దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే మండలాల వారీగా క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం.
కష్టాలు తప్పవు
గ్రామ స్థాయిలో ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న సచివాలయాల్ని క్లస్టర్లు మార్చితే ప్రజలకు ఇబ్బందులు తప్పవని వైఎస్సార్‌సీపీ నాయకులు అంటున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో గిరిజనుల బాధలు వర్ణణాతీతం. రెండు సచివాలయాలను ఒకటిగా చేస్తే ప్రజలకు మెరుగైన సేవల అందవని ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని నాయకులు కోరుతున్నారు.
జనాభా ప్రాతిపదికన రెండు కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు
ఉమ్మడి పశ్చిమ పరిధిలో 1,165 సచివాలయాలు
582కే పరిమితం చేసేలా పావులు
సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర
దేశానికే ఆదర్శంగా నిలిచిన సచివాలయాలను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దీనిలో భాగంగానే క్లస్టర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. రెండు సచివాలయాలు ఒకటి చేయడం వల్ల ప్రజలకు కష్టాలు తప్పవు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజల వద్దకు ప్రభుత్వ సేవలు అందేవి. క్లస్టర్ వ్యవస్థ ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలి. – తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే
సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర


